వీరజవానుపై దేశద్రోహి ముద్ర?

February 11, 2017


img

ఒక కుక్కను చంపాలంటే ముందు దానిపై పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలన్నట్లు, మన సరిహద్దు భద్రతాదళాలలో జరుగుతున్న అవకతవకలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టినందుకు తేజ్ బహదూర్ యాదవ్ పై దేశద్రోహి అనే ముద్రవేసి శిక్షించే ప్రయత్నాలు మొదలైనట్లు కనిపిస్తోంది. 

మన సరిహద్దు భద్రతాదళాలు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఒకవైపు పాక్ సైనికులతో, మరోపక్క ఉగ్రవాదులతో పోరాడుతుంటారు. వారికి కనీసం సరైన ఆహారం కూడా ఈయడం లేదనే సంగతిని తేజ్ బహదూర్ యాదవ్ బయటపెట్టాడు. అప్పటి నుంచి అతనిపై అదికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అతనిని వేరే సరిహద్దు ప్రాంతానికి బదిలీ చేసినట్లు అధికారులు చెపుతున్నారు. కానీ ఎక్కడికి బదిలీ చేశారో అతని భార్యకు కూడా చెప్పడం లేదు. అతను ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియక అతని భార్య తీవ్ర ఆందోళన చెందుతోంది. 

అతని గురించి తాజాగా మీడియాలో ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. అతని ఫేస్ బుక్ అకౌంట్ లో సుమారు 3,000 మంది స్నేహితులు ఉన్నారని, వారిలో 500 మంది పాకిస్తాన్ కు చెందినవారేనని, అతని పేరిట 39 నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయని దాని సారాంశం.

తేజ్ బహదూర్ యాదవ్ ఇప్పుడు కొత్తగా బి.ఎస్.ఎఫ్.లో చేరలేదు. అతను వచ్చే నెలలోనే పదవీ విరమణ చేయబోతున్నాడు. ఇంత కాలం అతను సర్వీస్ లో ఉన్నప్పుడు పైఅధికారులకు అతనిపై ఎటువంటి పిర్యాదు లేదు. కానీ ఎప్పుడైతే వారిపై పిర్యాదు చేశాడో అప్పటి నుంచి అతను వారి దృష్టిలో దేశద్రోహి అయిపోయాడు. హటాత్తుగా అతని ఫేస్ బుక్ అకౌంట్ లోకి 500 మంది పాకిస్తానీలు వచ్చి చేరారు. సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్  అయిపోయినవారికే 3,000 మంది స్నేహితులు ఉండటం చాలా అరుదు. మరి సరిహద్దు వద్ద ఉండే ఒక సాధారణ సైనికుడికి అంతమంది స్నేహితులు ఉండటం సాధ్యమేనా? అంటే కాదనే అర్ధం అవుతుంది. ఇక దేశంలో పెద్ద పెద్ద నగరాలలోనే నేటికీ చాలా చోట్ల ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. మరి నిత్యం యుద్ద వాతావరణం ఉన్న భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఇంటర్నెట్ పనిచేస్తుందా? అంటే చేయదనే ఎవరైనా చెప్పగలరు. కనుక తేజ్ బహదూర్ యాదవ్ ని బలిపశువు చేసేందుకే ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే మీడియాకు ఇటువంటి లీకులు ఇస్తున్నారని అనుమానించక తప్పదు. 

అతను తమ పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టినప్పుడు దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న మన వీర జవానుల కష్టాన్ని చూసి యావత్ దేశ ప్రజలు చలించిపోయారు. అతను తమకు సరైన ఆహారం అందడం లేదని పిర్యాదు చేసినప్పుడు అతని పైఅధికారులు ఆ సమస్యను తక్షణం సరిదిద్దవలసిందిపోయి అతని మీద ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం చాలా హేయమైన చర్య. 

అయినా మన దేశంలో తప్పులు చేయని అధికారులు, నేతలు, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు?ప్రధానమంత్రి స్థాయి నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఏవో ఒక తప్పులు చేస్తూనే ఉన్నారు. అంతమాత్రాన్న వారందరినీ దేశద్రోహులనగలమా? ఒకవేళ తేజ్ బహదూర్ యాదవ్ నిజంగానే తప్పు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నట్లయితే అతనిని సగౌరవంగా ఇంటికి సాగనంపవచ్చు తప్ప వేధించడం చాల తప్పు.


Related Post