శశికళ ఆదేశాల మేరకు పన్నీర్ సెల్వం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి ఆమెనే ఆ పదవి చేపట్టామని కోరినప్పుడు, ఆయన ఒక వెన్నెముక లేని డమ్మీ ముఖ్యమంత్రి అనే అభిప్రాయం ప్రజలకు కలిగించారు. కానీ ఆ మరునాడు శశికళపై తిరుగుబాటు చేసినప్పటి నుంచి అందరి దృష్టిలో హీరోగా మారిపోయారు. ప్రజలు, మీడియా, తమిళసినీ పరిశ్రమ అందరూ ఆయన పక్షానే నిలబడుతుండటంతో ఆయన ఇప్పుడు తన విశ్వరూపం శశికళకు చూపిస్తున్నారు. 
అన్నాడిఎంకె పార్టీ నిబంధనల ప్రకారం పార్టీలో కనీసం ఐదేళ్ళ సభ్యత్వం కలిగి ఉన్నవారు మాత్రమే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడానికి అర్హులు. శశికళకు అది లేనందున ఆమె ఎన్నికను గుర్తించరాదని, ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ పన్నీర్ సెల్వం ఎన్నికల కమీషన్ (ఈసి)కి ఒక లేఖ వ్రాశారు. ఈసి కూడా ఇదే విషయమై ప్రశ్నిస్తూ ఇప్పటికే శశికళను సంజాయిషీ కోరుతూ నోటీసు పంపించినట్లు సమాచారం. కనుక శశికళకు ఈసి నుంచి కూడా ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు.
సెల్వం, శశికళ ఇద్దరూ నిన్న సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసినప్పటికీ ఇంతవరకు ఆయన ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో శశికళ వర్గంలో టెన్షన్ మొదలైంది. ఆమెకు మద్దతు ఇస్తున్న 130 మంది ఎమ్మెల్యేలను శశికళ అనుచరులు బలవంతంగా ఒక హోటల్లో నిర్బందించి ఉంచారని సెల్వం వర్గం చేస్తున్న ప్రచారం కారణంగా కూడా శశికళపై క్షణక్షణానికి ఒత్తిడి పెరిగిపోతోంది. మరొక్క రెండు రోజులు పరిస్థితులు ఇలాగే వేగంగా మారుతున్నట్లయితే, శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు అందరూ తమంతట తాముగానే పన్నీర్ సెల్వం వైపు ఫిరాయించే అవకాశం కనబడుతోంది. కనుక తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని రేపు డిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ముందు బలప్రదర్శన చేయాలని శశికళ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తాజాగా మరొక సంచలన వార్త వినిపిస్తోంది.
అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆమెకు ఈరోజు సమన్లు పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ వార్తలు నిజమైతే ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం సంగతి మరిచి, ఆ కేసులో మళ్ళీ జైలుకి వెళ్ళకుండా తనను తాను కాపాడుకోవలసి ఉంటుంది. ఈసారి కేసు సుప్రీంకోర్టు విచారిస్తోంది కనుక అంతిమ తీర్పు తనకు వ్యతిరేకంగా రాకుండా చూసుకోవడం ఆమెకు చాలా అవసరం. లేకుంటే పోయెస్ గార్డెన్ లో బదులు జైలులో కూర్చోవలసి వస్తుంది.