తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనదాని కంటే మరికాస్త ఎక్కువ అంటే 130మంది ఎమ్మెల్యేలు మద్దతు చిన్నమ్మ (శశికళ) అవలీలగా ముఖ్యమంత్రి అయిపోతారనుకొంటే, ఒకదాని తరువాత మరొకటిగా ఊహించని కష్టాలు వచ్చి పడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 
శశికళకు మద్దతు ఇస్తున్న ఆ ఎమ్మెల్యేలందరినీ ఆమె అనుచరులు చెన్నైకి సమీపంలో మహాబలిపురం వద్ద గల గోల్డెన్ రిసార్ట్స్ కు తరలించి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొన్నారు. వారి నుంచి నిన్నటి నుంచి ఫో కాల్స్ రాకపోవడం, వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారి ఫోన్లు స్విచ్చ్ ఆఫ్ చేసి ఉండటంతో వారి యోగక్షేమాల గురించి వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఈ వ్యవహారంపై నిన్న దాఖలైన ఒక పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని, వారి క్షేమసమాచారాల గురించి లిఖితపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర డిజిపి టికె రాజేంద్రన్ న్నుఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పోలీసు అధికారులను వెంటబెట్టుకొని కొద్దిసేపటి క్రితం అక్కడికి బయలుదేరినట్లు తెలుస్తోంది.
పన్నీర్ సెల్వం వర్గం నుంచి బెదిరింపు కాల్స్ వస్తునందునే వారందరూ భయంతో తమ ఫోన్లను ఆఫ్ చేసుకొన్నారన్న అన్నాడిఎంకె న్యాయవాది వాదనను తిరస్కరించిన న్యాయస్థానం వారి ఆచూకి కనుగొనడానికి డిజిపిని పంపడంతో శశికళకు ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు. వారిలో ఎవరైనా డిజిపికి శశికళ తమని అక్కడ బలవంతంగా నిర్బందించి ఉంచిందని పిర్యాదు చేస్తే ఇక శశికళకు కొత్త కష్టాలు మొదలవుతాయి.