ట్రంప్ ప్రభుత్వం ఏడు ముస్లిం దేశాలపై విదించిన ట్రావెల్ బ్యాన్ పై సియాటెల్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీలేట్ కోర్టు కూడా సమర్ధించింది. ట్రావెల్ బ్యాన్ పై సియాటెల్ కోర్టు విదించిన స్టే ఆర్డర్ ను ఎత్తివేయడానికి నిరాకరించింది. దానితో ట్రంప్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అప్పీలేట్ కోర్టు తీర్పుపై ట్రంప్ మండిపడ్డారు. న్యాయస్థానాలు దేశభద్రతను తమ చేతుల్లోకి తెసుకొని దేశాన్ని, ప్రజలను పణంగా పెడుతున్నాయని విమర్శించారు. అప్పీలేట్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని ట్రంప్ ప్రకటించారు. అప్పీలేట్ కోర్టు తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 
దేశాధ్యక్షుడు న్యాయవ్యవస్థల పట్ల ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. న్యాయవ్యవస్థ పట్ల ట్రంప్ దురాభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టుకు కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక అది కూడా దిగువకోర్టులతో ఏకీభవించినట్లయితే ట్రంప్ కు అది మరో పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.
ఒక ప్రభుత్వ తీసుకొన్న నిర్ణయాన్ని న్యాయవ్యవస్థలు తప్పు పడితే దాని వలన వ్యక్తిగతంగా ఎవరికీ ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ దేశాధ్యక్షుడిగా ట్రంప్ స్వయంగా తీసుకొన్న నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు పట్టి వాటిని ఈవిధంగా తిరస్కరిస్తుంటే అది ఆయనకు అధ్యక్ష పదవికి కూడా చాలా అవమానంగానే భావించవలసి ఉంటుంది.
ఆయన ఇదే నిర్ణయాన్ని అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో చర్చించి దాని ఆమోదంతో అమలుచేసి ఉండి ఉంటే యావత్ దేశమూ ఆయన వెంట ఉండేది. కానీ లేడికి లేచిందే పరుగు.. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా ట్రంప్ సాగుతున్నందునే అత్యున్నతమైన, అత్యంత గౌరవనీయమైన దేశాధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ అందరి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పదేపదే నవ్వుల పాలవుతున్నారు. ఇది స్వయంకృతాపరాధమే కనుక ఎవరినీ నిందించడం సరికాదు.