తమిళనాడు అధికార అన్నాడిఎంకెలో జరిగిన కొన్ని పరిణామాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. 
1. శశికళను పార్టీ అధినేతగా, శాసనసభాపక్ష నేతగా స్వయంగా ప్రతిపాదించిన పన్నీర్ సెల్వం, మొన్న అకస్మాత్తుగా మాట మార్చి తనను శశికళ వర్గం బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిందని వాదిస్తున్నారు. అయితే ఆయన మొదటే ఎందుకు వ్యతిరేకించలేదు? ఆయనే స్వయంగా శశికళను ఎందుకు సమర్ధించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ ఆయన వద్ద సమాధానాలు లేవు.
2. చాలా చాకచక్యంగా పార్టీ పగ్గాలను చేజిక్కించుకొని, ముఖ్యమంత్రి పీఠం కూడా అధిష్టించాలని తహతహలాడిపోతున్న శశికళ, తనకు రాజకీయాలపై, అధికారంపై అసలు ఏమాత్రం ఆసక్తి లేదని, జయలలితకు వ్యతిరేకంగా తన బంధువులు కుట్రలు చేశారని అంగీకరిస్తూ స్వహస్తాలతో వ్రాసిన లేఖను పన్నీర్ సెల్వం బయటపెట్టి ఇప్పుడు ఆమెను నిలదీస్తున్నారు. ఆ ప్రశ్నలకు శశికళ వద్ద సమాధానాలు లేవు.
3. ముఖ్యమంత్రి చేతనే బలవంతంగా రాజీనామా చేయించడం నిజమైతే, ఇక ఎమ్మెల్యేల చేత మద్దతు పత్రాలపై సంతకాలు చేయించడం కష్టమా? అంటే కాదనే అర్ధం అవుతోంది.
4. ఇక శశికళకు అన్నాడిఎంకె ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని తెలిసినా, చాలా మంది ప్రజలు, ప్రముఖులతో సహా మీడియా కూడా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడం విశేషం. జయలలిత చనిపోయే వరకు ఆమెను ఎవరూ కలవనీయకుండా చేయడం, ఆమె మరణించిన కొన్ని గంటలలోనే పార్టీ పగ్గాలు చేపట్టడానికి శరవేగంగా పావులు కదపడం, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం తహతహలాడటం వంటి పరిణామాలన్నిటినీ కలిపి చూసినట్లయితే ఆమె దోషిగానే కనబడుతున్నారు. జయలలిత మరణానికి ఆమె కారకురాలు అనేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, బహుశః ఈ కారణంగానే ప్రజలు ఆమె పట్ల వ్యతిరేకత కనబరుస్తున్నట్లు చెప్పవచ్చు. మీడియా కూడా బహుశః ఇదే కారణం చేత శశికళను వ్యతిరేకిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.
5. ప్రజలలో తన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనే సంగతి శశికళకు, ఆమెకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు తెలియదనుకోలేము. కానీ మొండిగా ముందుకు వెళుతున్నందున వారు అధికార దాహంతో అలమటించిపోతున్నారనే అభిప్రాయం ప్రజలకు కలిగిస్తున్నారని చెప్పక తప్పదు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకోగలిగితే, ప్రజలకు వరాలు ప్రకటించేస్తూ మెల్లగా వారిని తనవైపు తిప్పుకోవచ్చని శశికళ భావిస్తున్నారేమో?
6. ఇదివరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ అన్ని వర్గాల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నారో, ఇప్పుడు శశికళ కూడా ఇంచుమించు అటువంటి వ్యతిరేకతనే ఎదుర్కోవడం ఆసక్తికర పరిణామమే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకూడదని చాలా మంది కోరుకొన్నట్లుగానే ఇప్పుడు శశికళ కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టకూడదని కోరుకొంటుండటం ఆశ్చర్యకరమే. కారణాలు పైన చెప్పుకొన్నాము.