ఈ తమిళ సినిమా క్లైమాక్స్ రొంబ సస్పెన్స్

February 09, 2017


img

తమిళనాడు ఇన్-ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు మధ్యాహ్నం చెన్నై చేరుకోవడంతో అధికార అన్నాడిఎంకె పార్టీలో పన్నీర్ సెల్వం, శశికళల మద్య జరుగుతున్న ఆధిపత్యపోరు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించినట్లుగానే మొదట ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వంకు సాయంత్రం 5గంటలకు, సాయంత్రం 7 గంటలకు శశికళకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. తనతో సమావేశానికి ఆమెను ఒక్కరినే రావలసిందిగా సూచించారు. ఆమె తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను, మంత్రులను వెంటబెట్టుకొని వచ్చి బలప్రదర్శన చేసి గవర్నర్ పై ఒత్తిడి తీవాలనుకొంటే, ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన ఆయన శశికళ ఒక్కరే రావాలని ఆదేశించడం శశికళ పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. 

గవర్నర్ ముందు 4 ఆప్షన్లు ఉన్నాయి. 

1. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు శశికళకు ఉందని భావించినట్లయితే ఆమె చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడం.  

2. ఒకవేళ ఎవరికి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందో తెలియకపోతే, ఇద్దరినీ శాసనసభలో బలనిరూపణ చేసుకోమని ఆదేశించి దానిలో నెగ్గినవారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడం.

3. పన్నీర్ సెల్వం తన రాజీనామాను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించి మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రిగా ప్రకటించడం.

4. ఇద్దరూ బలనిరూపణ చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే రాష్ట్రంలో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విదించమని రాష్ట్రపతికి సిఫార్సు చేయడం. 

ఈ నాలుగు ఆప్షన్లలో అయన రెండవ దానికే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఆవిధంగా చేసినట్లయితే, ఎవరూ ఆయనను కానీ కేంద్రప్రభుత్వాన్ని గానీ వేలెత్తి చూపించలేరు. అది రాజ్యంగబద్దమే కనుక న్యాయస్థానాలలో కూడా సవాలు చేయలేరు. మిగిలిన ఆప్షన్లలో ఆయన దేనికి మొగ్గినా ఏదో ఒక వర్గం నుంచి విమర్శలు భరించక తప్పదు. మరి కొన్ని గంటలలోనే ఈ సస్పెన్స్ తమిళసినిమా క్లైమాక్స్ సన్నివేశాలు మొదలయ్యే అవకాశం ఉంది.


Related Post