తెరాస వ్యూహం ఫలిస్తుందా?

February 09, 2017


img

తెలంగాణా ఏర్పడిన తరువాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తెరాస గత రెండున్నరేళ్ళలో రాష్ట్రంలో చాలా బలంగా నిలద్రొక్కుకోగలిగింది. 2019 ఎన్నికలలో కూడా మళ్ళీ విజయం సాధించి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకొంటోంది. అది సహజమే. అందు కోసం ఇంతవరకు అది చేసిన ప్రయత్నాల గురించి అందరికీ తెలుసు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదన చేస్తోందని భాజపా ఆరోపిస్తోంది. నిజానికి గత ఎన్నికలలో అధికారం రావడం కోసం ఇచ్చిన హామీలలో అది కూడా ఒకటి. కనుక ఆ హామీని నిలబెట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవాలనుకోవడం అసహజమైన చర్య ఏమీ కాదనే చెప్పవచ్చు. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న భాజపా, యూపి ఎన్నికలలో హిందూ ఓటర్లకు గళం వేసేందుకు అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. కనుక ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుండటం సహజమే. 

తెరాస సర్కార్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో బిల్లుపెట్టి దానిని ఆమోదించి కేంద్రానికి పంపించగలదు. కనుక దాని పరిధి అంతవరకేనని చెప్పవచ్చు. కానీ తన హామీకి కట్టుబడ్డానని, కానీ కేంద్రం ఆమోదించకపోతే అది తన తప్పు కాదని ముస్లిం ప్రజలకు చెప్పుకొనే అవకాశం దానికి లభిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మజ్లీస్ సహకారం తీసుకోకుండానే ఘన విజయం సాధించిన తరువాత తెరాసకు ఈ కొత్త ఆలోచన కలిగి ఉండవచ్చు. దానినే వచ్చే ఎన్నికలలో కూడా అమలుచేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదన చేస్తోందని భావించవచ్చు. ఈ ప్రయత్నం కూడా సాళం అయితే ఇక మజ్లీస్ మద్దతు లేకుండానే తెరాస ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించే అవకాశం కలుగుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో తెరాస-భాజపాలు పొత్తులు పెట్టుకోకుండా విడివిడిగా పోటీ చేసినట్లయితే, భాజపాపై ఇదే అస్త్రాన్ని తెరాస ప్రయోగించే వెసులుబాటు కూడా ఉంటుంది.  కానీ భాజపా ప్రధానంగా హిందూ ఓటు బ్యాంక్ మీదే ఆధారపడుతుంది కనుక దాని వలన భాజపాకు పెద్దగా నష్టం కలుగకపోవచ్చు. 


Related Post