జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పటి నుంచి నేటి వరకు కూడా తమిళనాడులో ప్రవేశించాలని భాజపా చాలా తహతహలాడుతోంది. భాజపా కూడా ఒక రాజకీయ పార్టీయే కనుక అది అత్యాశ, దురాశ కాదనే చెప్పవచ్చు. శశికళకు ముఖ్యమంత్రి పదవి చేతికి అందినట్లే అంది చేజారిపోతున్నట్లే, భాజపా కూడా తమిళనాడులో ప్రవేశించే అవకాశాలు చేతికి అందినట్లే అంది జారిపోతున్నాయి.
శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయక మునుపే ఏదో ఒకటి చేయాలని లేకుంటే రాష్ట్రంలో భాజపాకు ఇదే ఆఖరి అవకాశమని కేంద్రప్రభుత్వం భావింస్తోందో ఏమో తెలియదు కానీ తమిళనాడులో ఇంత రాజకీయ సంక్షోభం జరుగుతున్నా ఇంతవరకు గవర్నర్ విద్యాసాగర్ రావు ఎక్కిన విమానం డిల్లీ ముంబై మద్యే చక్కర్లు కొడుతోంది గానీ చెన్నైవైపు రావడంలేదు. బహుశః అది కూడా భాజపా వ్యూహంలో భాగమే కావచ్చు. కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తరువాత, అన్నాడిఎంకె పార్టీకి ఎమ్మెల్యేలు అందరూ తమ శాసనసభా పక్షనేతను ఏకగ్రీవంగా ఎన్నుకొన్న తరువాత కూడా గవర్నర్ వారికి మొహం చాటేయడం, ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం రాజ్యాంగపరంగా తప్పేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సుప్రీంకోర్టు త్వరలో శశికళకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందనే ఊహాజనితమైన అనుమానంతో ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించకపోవడం కూడా తప్పేనని, అది ఒక సాకు మాత్రమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే ఏమి చేయాలనే సంగతి శశికళ నిర్ణయించుకోవలసి ఉంటుంది తప్ప గవర్నరో లేదా కేంద్రప్రభుత్వం కాదు.
శశికళ చాలా చాకచక్యంగా పావులు కదిపి ముఖ్యమంత్రి పీఠం చేపట్టాలనుకోవడం నిజమే కావచ్చు. రాష్ట్ర ప్రజలు ఆమె ముఖ్యమంత్రిగా అంగీకరించకపోవచ్చు. కానీ రాజ్యాంగ ప్రకారం ఆమెకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అధికారం ఉందనే వాదనను ఎవరూ కాదనలేరు. కనుక ఈ విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఆలస్యం చేస్తున్నకొద్దీ కేంద్రప్రభుత్వం, భాజపాలే ఆ నింద భరించవలసి ఉంటుంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కేంద్రప్రభుత్వం జోక్యం కోరుతున్నప్పటికీ, భాజపా ఈ విషయంలో తప్పటడుగులు వేస్తే దానికే ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కనుక ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడమే బాజపాకు కూడా చాలా మంచిది.