ఈరోజు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధించుకొంటూ మాట్లాడినప్పుడు, అటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చేయలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ హయంలో వరుస కుంభకోణాలే తప్ప మరొకటి వినపడేవికావని, అయినా నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఎటువంటి మచ్చ అంటకపోవడం గురించి వర్ణిస్తూ, “బాత్రూంలో రెయిన్ కోట్ వేసుకొని స్నానం ఎలా చేయాలో ఆయన నుంచే నేర్చుకోవాలి,” అని అన్నారు. మన్మోహన్ సింగ్ పట్ల ప్రధాని మోడీ అంత చులకనగా మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకవుట్ చేసింది.
మోడీతో పోలిస్తే మన్మోహన్ సింగ్ చాలా విద్యాధికుడు, గొప్ప ఆర్ధికవేత్త, అపారమైన రాజకీయ, పరిపాలనానుభావం ఉన్నవారు. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు హయంలో ఆయన దేశ ఆర్దిక వ్యవస్థను ఎంతగొప్పగా తీర్చిదిద్దారో అందరూ చూశారు. కానీ అదే వ్యక్తి అంతకంటే ఉన్నతమైన, శక్తివంతమైన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి దేశవిదేశాలలో కూడా తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్న సంగతి అందరికీ తెలుసు. ప్రధానమంత్రిగా ఆయన దేశ ఆర్ధిక, రాజకీయ, పారిశ్రామిక వ్యవస్థలను పరుగులు పెట్టించవలసిందిపోయి, అన్ని రంగాలకు అవినీతి ఊడలు పాకుతుంటే, నిత్యం కుంభకోణాలు వెలుగులోకి వస్తుంటే నిస్సహాయంగా చేతులు ముడుచుకొని కూర్చొన్నారు.
ఆయన స్వయంగా ఎన్నడూ అవినీతికి పాల్పడనప్పటికీ తన హయంలో జరిగిన అవినీతికి, బయటపడిన కుంభకోణాలకు ఆయనే బాధ్యత వహించక తప్పదు. కానీ ఆయన బాధ్యత తీసుకోలేదు..కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి జరిగినట్లు ఎన్నడూ అంగీకరించడంలేదు కనుక వాటికి బాధ్యతవహించే ప్రసక్తే ఉండదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని కుంభకోణాలు జరిగిన కాంగ్రెస్ పార్టీ వాటికి ‘రాజకీయ వేధింపుల రంగు’లద్ది తను తప్పించుకోవడమే కాకుండా మన్మోహన్ సింగ్ ను కూడా కోడి పెట్ట తన పిల్లలను రెక్కల క్రింద దాచుకొని కాపాడినట్లు కాపాడుకోస్తోంది.
‘ఊర్లో అందరూ శాఖాహారులే అయితే మరి గంపెడు చేపలు ఎవరు తిన్నారు?’ అన్నట్లు కాంగ్రెస్ హయంలో బయటపడిన కుంభకోణాలు కూడా సమాధానం దొరకని శేష ప్రశ్నలుగా మిగిలిపోయాయి. బహుశః అందుకే ప్రధాని నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ ను ఉద్దేశ్యించి అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది కనుక ఆయన వ్యాఖ్యలు కూడా చేదుగా ఘాటుగానే వినిపించడం సహజమే. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా నిజం నిజంగానే ఉంటుంది తప్ప మారదు.