ఒకప్పుడు వైకాపా అధినేత జగన్ ప్రజలను ఆకట్టుకోవడానికి నిత్యం తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేరు జపిస్తుండేవారు. ఏపిలో ఇప్పుడు వైకాపా బలపడటంతో ఇదివరకులాగ ఇప్పుడు ఎక్కువగా జపించడం లేదు. రాజశేఖర్ రెడ్డి పేరును తెలంగాణా వైకాపా నేతలు మాత్రమే వాడుకొంటున్నారు.
తెదేపాలో కూడా స్వర్గీయ ఎన్టీఆర్ భజన సాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు అది ఇంకా ఎక్కువ స్థాయిలో జరుగుతుంటుంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించడంతో తెదేపాకు మళ్ళీ స్వర్గీయ ఎన్టీఆర్ అవసరంపడిందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో తెదేపా అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. మరో రెండేళ్ళలో తానే తప్పకుండా ఏపికి ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెపుతున్నారు కనుక మొట్టమొదట వైకాపా నుంచే తెదేపాకు గట్టి సవాలు ఎదురవవచ్చు. కాపులకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం వారి ఓట్లన్నీ వైకాపా ఖాతాలో జామా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు కనబడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని చెపుతున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలను అమలుచేయనందుకు ప్రతిపక్షాలన్నీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తూ వాటిపై వేడి చల్లారకుండా జాగ్రత్తగా కాపాడుకొస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఆ హామీలే ప్రధానాంశాలుగా మారుస్తానని జగన్ ఇదివరకే ప్రకటించారు. ఆ హామీలే తెదేపా-భాజపాల మద్య చిచ్చు రగిలిస్తున్నాయి. అది రగిలినప్పుడల్లా తెదేపా పాలనలో అవినీతి పెరిగిపోయిందని భాజపా నేతలు బహిరంగంగానే విమర్శిస్తుంటారు. కనుక వచ్చే ఎన్నికల నాటికి తెదేపా-భాజపాల సంబంధాలు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి.
ఇవన్నీ తెదేపాకు వచ్చే ఎన్నికలను పెద్ద అగ్నిపరీక్షగా మార్చబోతున్నాయి. కనుక దానిలో నెగ్గాలంటే స్వర్గీయ ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకోవడం మంచిదనే ఆలోచనతోనే బాలకృష్ణ చేత చంద్రబాబు నాయుడు ఈ సినిమా ప్రతిపాదన చేయించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సినిమాను విడుదల చేయగలిగితే, అది తెదేపాకు ఎంతో కొంత మేలు చేయవచ్చని బాబు భావిస్తున్నారేమో? ఆ లెక్కన జూ.ఎన్టీఆర్ ను కూడా మళ్ళీ బుజ్జగించి దగ్గరకు తీసుకొనే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.