తమిళనాడు ఇన్-చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు శశికళకు సహకరించి ఉండి ఉంటే, ఆమె ఈపాటికి ముఖ్యమంత్రి అయ్యుండేవారే కానీ ఎవరూ ఊహించని విధంగా ఆఖరు నిమిషంలో ఆయన హ్యాండ్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి పదవి చేతికి అందినట్లే అంది జారిపోయింది. ఈలోగా నిన్న రాత్రి పన్నీర్ సెల్వం తనకు ‘జయలలిత ఆత్మ’ కనబడి చెప్పిందంటూ శశికళపై తిరుగుబాటు చేయడంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. దీనితో తమిళనాట రాజకీయాలలో బ్రతికున్న మనుషులే కాకుండా ఆత్మలు కూడా రాజకీయాలలో చాలా యాక్టివ్ గా ఉంటాయనే కొత్త విషయం బయటపడింది. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకోవాలనుకొంటున్నానని చెప్పడంతో శశికళకు నేరుగా సవాలు విసిరినట్లయింది.
ఆయన వెనుక డిఎంకె పార్టీ ఉందని శశికళ వర్గం ఆరోపిస్తోంది. కానీ ఆయన చెపుతున్న ఆ ‘ఆత్మ’ జయలలితది కాదు కేంద్రప్రభుత్వానిదని అర్ధం అవుతూనే ఉంది. ఒకవేళ కేంద్రప్రభుత్వానికి శశికళ ముఖ్యమంత్రి పదవి చేప్పట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయుంటే, నిన్ననే గవర్నర్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించి ఉండేవారు. కానీ చేయించలేదు. కేంద్రానికి శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇష్టం లేదని చెప్పేందుకు అదే నిదర్శనం. కానీ పార్టీ ఎమ్మెల్యేలందరి మద్దతు ఉన్న ఆమెను అడ్డుకొంటే రాష్ట్రంలో భాజపా, కేంద్రప్రభుత్వం పట్ల మళ్ళీ వ్యతిరేకత కనబడుతుంది. కనుకనే ఆలోచించుకోవడానికి కొంత సమయం తీసుకొని పన్నీర్ సెల్వం ద్వారా ఈ వ్యూహం అమలుచేయించి ఉండవచ్చు.
జయలలిత మరణించిన రెండు నెలల వ్యవధిలోనే శశికళ తెర వెనుక శరవేగంగా పావులు కదుపుతూ పార్టీని, ఎమ్మెల్యేలను తన అధీనంలోకి తెచ్చుకోగాలిగారు. అంటే ఆమె జయలలిత కంటే చాలా తెలివిగా, చురుకుగా పావులు కదపగలరని నిరూపించుకొన్నారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆమె ఆ పదవిలో ఉన్నంతకాలం భాజపా ఇక ఆ రాష్ట్రంలో ప్రవేశించలేకపోవచ్చు. కనుకనే మృదు స్వభావం కలిగిన పన్నీర్ సెల్వం పట్ల కేంద్రప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు చెప్పవచ్చు.
శశికళ ముఖ్యమంత్రి పదవి చెప్పట్టడం ప్రతిపక్ష డిఎంకె పార్టీకి కూడా ఇష్టం లేదు. ఆ పార్టీ నేత స్టాలిన్ ఇప్పటికే డిల్లీ చేరుకొని ప్రధానిని కలిసేందుకు ఎదురుచూస్తున్నారు. సెల్వం కూడా ఈరోజు డిల్లీ వెళ్ళబోతున్నారు. శశికళను అడ్డుకొనేందుకు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని డిఎంకె సంకేతాలు ఇస్తూనే ఉంది. కనుక డిల్లీ పెద్దలు వారిద్దరినీ ‘సెట్’ చేసి చెన్నై పంపించవచ్చు.
చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఏ కేంద్రప్రభుత్వం, భాజపాను తమిళనాడుకు దూరంగా ఉంచాలనుకొన్నారో, ఇప్పుడు దానినే జోక్యం చేసుకోమని తమిళ తంబిలు కోరుతున్నారు. ఈ తమిళ పంచాయితీ చెన్నై నుంచి డిల్లీకి మారింది కనుక ఇప్పుడు గవర్నర్ ద్వారా కేంద్రప్రభుత్వం తమిళనాడులో చక్రం తిప్పగలదు.
శశికళ ప్రమాణస్వీకారోత్సవానికి మొహం చాటేసిన గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు చెన్నైలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. అదే..ఆయన నిన్న చెన్నై వచ్చి ఉండి ఉంటే, శశికళ చేత ప్రమాణస్వీకారం చేయించవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అన్నాడిఎంకె పార్టీ రెండుగా చీలిపోవడంతో ఆయన చెన్నై, డిల్లీలో జరుగబోయే రాజకీయ పరిణామాలు, నిర్ణయాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు.