“దేవుడు మన వైపే ఉన్నాడు. ప్రజలు కూడా మనవైపే ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో మనమే తప్పకుండా గెలిచి అధికారంలోకి రాబోతున్నాము. 14 రీళ్ళు ఉండే మన సినిమాలలో 13 రీళ్ళలో విలన్ దే పై చెయ్యిగా ఉంటుంది. కానీ 14వ రీలులో మాత్రం హీరోదే పై చెయ్యి అవుతుంది. ఎందుకంటే హీరో ఎప్పుడూ ధర్మం వైపు నిలబడుతుంటాడు. ప్రస్తుతం రాష్ట్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే పై చెయ్యి కావచ్చు కానీ ధర్మం వైపు నిలబడి పోరాడుతున్న మనమే వచ్చే ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తాం. మహాభారతం, రామాయణం, బైబిల్.. ఖురాన్ దేనిలోనైన ధర్మానిదే అంతిమ విజయం. మనదీ అంతే. మరొక్క రెండేళ్ళు ఓపిక పడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మనమే అధికారంలోకి వస్తాము కనుక అప్పుడు అందరి కష్టాలు తీరిపోతాయి. ఇప్పుడు నా వెంట ఉన్న వారినందరినీ పేరుపేరునా గుర్తు పెట్టుకొని అందరి రుణం తీర్చుకొంటాను. పార్టీ కోసం కష్టపడినవారందరికీ సముచితః గౌరవం లభిస్తుంది.” ఈ మాటలు అన్నది ఎవరూ ఇప్పటికే పాటకులకు అర్ధమయ్యే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు, కార్యకర్తలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశ్యించి తరచూ చెప్పే మాటలివి.
జగన్ 2014ఎన్నికలలో కూడా ఇలాగే గొప్పలు చెప్పుకొన్నారు కానీ ఓడిపోయారు. అయినా గొప్పలు చెప్పుకోవడం మానుకోలేదు. ముఖ్యమంత్రి కావాలని ఆయన ఎంతగా తహతహలాడిపోతున్నారో ఆయన మాటలే నిరూపిస్తున్నాయి. ప్రజలు ఎప్పుడూ తమవైపే ఉన్నారని అధికారపార్టీలు గొప్పలు చెప్పుకొంటుంటాయి. ఏపిలో అధికారంలో ఉన్న తెదేపా కూడా అలాగే చెప్పుకొంటుంది. జగన్ కూడా అదే చెప్పుకొంటున్నారు. ప్రజలు ఎటువైపున్నారో ఎన్నికలు వస్తే స్పష్టంగా తెలుస్తుంది. కానీ దేవుడు కూడా తనవైపే ఉన్నాడని జగన్ ఏవిధంగా చెప్పుకొంటున్నారో ఆయనకే తెలియాలి. సినిమాల పోలికలు చూస్తే జగన్ తన దృష్టిలో తను హీరోనని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ “ఆయన ఒక ఆర్ధిక నేరస్తుడు..వచ్చే ఎన్నికలలోగా మళ్ళీ జైలుకి వెళ్ళిపోవడం ఖాయం” అని తెదేపా నేతలు ఎద్దేవా చేస్తుంటారు. కనుక ఆంధ్రా రాజకీయాలలో అసలైన హీరో ఎవరో, విలన్ ఎవరో తెలుసు తెలుసుకోవాలంటే వచ్చే ఎన్నికల వరకు ఓపిక పట్టక తప్పదు.