తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తెరాస సర్కార్ మద్య ఇంతకాలం పరోక్షంగా సాగుతున్న యుద్దం , ఆయనపై తెరాస నేతల మూకుమ్మడి ఎదురుదాడితో ఇప్పుడు ప్రత్యక్షయుద్ధంగా మారినట్లు కనబడుతోంది. ఆయన విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, రైతుల సమస్యలు..ఇలాగ ఒక్కో అంశం తీసుకొని తెరాస సర్కార్ పై ప్రత్యక్ష యుద్ధం చేస్తుంటే, తెరాస నేతలు, మంత్రులు కూడా మొహమాటాలను పక్కనబెట్టి ఇప్పుడు అయనపై నేరుగా ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
ప్రొఫెసర్ కోదండరామ్ కి అసలు ఏమి కావాలో..మా సర్కార్ పై ఎందుకు కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదని మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మా పార్టీ ఆయనకు 2014ఎన్నికలలో ఎంపి లేదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సిద్దపడింది కానీ అక్కరలేదని చెప్పారు. మరి ఆయనకు ఏమి కావాలి? మాపై ఎందుకు పోరాడుతున్నారో ఆయనకే తెలియాలి,” అని నాయిని అన్నారు. ఆయన ఉద్యమ సమయంలో విద్యార్ధులను వాడుకొని, ఎన్నికలు వచ్చినప్పుడు జేఎసిలో తన అనుచరులకే పార్టీల చేత టికెట్లు ఇప్పించుకొని విద్యార్ధులను మోసం చేశారని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. కనుక ప్రొఫెసర్ కోదండరామ్ ని ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు.
తెరాస, ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శలు, ప్రతివిమర్శలు బహుశః మున్ముందు ఇంకా తీవ్రతరం కావచ్చు. అది ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేలా చేయవచ్చు. అదే కనుక జరిగితే, దాని వలన ఎక్కువ నష్టపోయేది తెరాసయే అవవచ్చు. అసలు ప్రొఫెసర్ కోదండరామ్ ఏమి కోరుకొంటున్నారు? తన లక్ష్యం ఏమిటో అనే మంత్రి నాయిని ప్రశ్నకు బహుశః వచ్చే ఎన్నికలలో జవాబు దొరకవచ్చు.