నేరగాడి ఆరోపణలు..

February 04, 2017


img

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోవడమే కాకుండా తిరిగి భారత ప్రభుత్వాలు, మీడియా, బ్యాంకులు, న్యాయస్థానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటం విచిత్రంగా ఉంది. గత యూపియే ప్రభుత్వం, ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వలకి మద్య జరుగుతున్న ఆధిపత్యపోరులో తాను బలిపశువుగా మారిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అనే మైదానంలో ఆ రెండు కూటములు తనను బంతిలాగ తంతూ ఫుట్ బాల్ ఆడుకొంటున్నాయని మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ ఆటలో న్యాయం చెప్పే రిఫరీయే లేడని ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్, భాజపాల మధ్య ఆధిపత్యపోరుసాగుతోందనే విజయ్ మాల్యా ఆరోపణ నిజమే కావచ్చు కానీ అయన ఆ రెంటినీ కూడా చాలా చక్కగా ఉపయోగించుకొన్నారు. కాంగ్రెస్ హయంలో ఆయనకు అప్పటి ప్రధాని, ఆర్ధికమంత్రి చాలా సహాయపడి బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించారని ఈ మద్యనే భాజపా ఆరోపించింది. ప్రభుత్వం సిఫార్సు, ఒత్తిడి లేనిదే ఏ బ్యాంకు అన్ని వేల కోట్లు అటువంటి వ్యక్తికి అప్పుగా ఇవ్వదని వేరే చెప్పనవసరం లేదు.

అయన బ్యాంకులకు బాకీ ఉన్న రూ.9,000 కోట్లు చెల్లించలేని పరిస్థితులలో ఉన్నారని, ఏ క్షణంలోనైనా దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నాయని మోడీ సర్కార్ కూడా తెలుసు. కానీ ఎందుకో ఉపేక్షించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన లండన్ పారిపోగలిగాడు. 

తను బ్యాంకులను మోసం చేయలేదని మాల్యా నమ్ముతున్నట్లయితే దేశంలోనే ఉండి న్యాయపోరాటాలు చేయవచ్చు. దేశంలో బ్యాంకుల నుండి కొన్ని వేలు, లక్షల కోట్లు రుణాలు తీసుకొన్న అనేక మంది పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారు ఎవరూ మాల్యాలాగ దేశం విడిచి పారిపోలేదు. మాల్యాకు బ్యాంకులను మోసం చేసే ఆలోచన ఉంది కనుకనే పారిపోయారు. ఆయన ఒక ఆర్ధిక నేరస్తుడు కనుకనే కోర్టులు, మీడియా కూడా ఆయన పట్ల కనికరం చూపడం లేదని చెప్పవచ్చు. చట్టాన్ని తప్పించుకొని తిరుగుతున్న అటువంటి ఘరాన ఆర్ధిక నేరస్తుడు, భారత ప్రభుత్వాలని, వ్యవస్థలని వేలెత్తి చూపుతుంటే భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడం చాలా శోచనీయమే.  


Related Post