ప్రాజెక్టులపై ఏమిటీ లొల్లి

February 04, 2017


img

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న పూర్తి భిన్నమైన వాదనల కారణంగా ప్రజలలో కొంత అయోమయం నెలకొని ఉందని చెప్పకతప్పదు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణాకు సాగునీటి విషయంలో చాలా అన్యాయం జరిగింది కనుకనే ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాడి సాధించుకొన్నామని, తీరా చేసి రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ప్రాజెక్టులు కట్టబోతుంటే ప్రతిపక్షాలు వాటికి అడ్డుపడుతున్నాయని తెరాస సర్కార్ వాదిస్తోంది. 

ప్రతిపక్షాలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతూ, భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేస్తూ ప్రాజెక్టులు కట్టకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నాయని వాదిస్తోంది. తెలంగాణా ఏర్పడినప్పటికీ ప్రాజెక్టులు కట్టుకోలేని దుస్థితి కల్పిస్తున్నాయని వాదిస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించి తీరుతామని, రాష్ట్రంలో అన్ని గ్రామాలకు మంచినీళ్ళు అందించి తీరుతామని తెరాస సర్కార్ గట్టిగా చెపుతోంది. చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తోంది. అందుకు భక్తరామదాసు ప్రాజెక్టే తాజా ఉదాహరణ.

సాగునీటి ప్రాజెక్టుల పేరు చెప్పి తెరాస సర్కార్ దౌర్జన్యంగా పేద రైతుల భూములు లాక్కొంటూ ఆంధ్రా పాలకుల కంటే హీనంగా ప్రవర్తిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని చెప్పుకొంటున్న తెరాస సర్కార్, వారి కోసమే కేంద్రప్రభుత్వం రూపొందించిన భూసేకరణ 2013 చట్టాన్ని అమలుచేయడానికి ఎందుకు వెనుకాడుతోందని  ప్రశ్నిస్తున్నాయి. భూసేకరణ చేస్తున్న ప్రాంతాలలో నిర్వాసితులను కలువనీయకుండా పోలీసులను పెట్టి మరీ తమను ఎందుకు అడ్డుకొంటోందని ప్రశ్నిస్తున్నాయి. ప్రజలకు ఒక విధంగా, నిర్వాసిత రైతులతో మరొక విధంగా, న్యాయస్థానాలతో మరొకవిధంగా మాటలు చెపుతూ తెరాస సర్కార్ అందరినీ తప్పు దారి పట్టిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ కూడా ప్రతిపక్షాల వాదనలతో ఏకీభవిస్తున్నారు. ఆయన కూడా తెరాస సర్కార్ తో పోరాడుతున్నారు. కనుక అధికార, ప్రతిపక్షాల వాదనలలో నిజానిజాలను తెలంగాణా రాష్ట్ర ప్రజలే స్వయంగా నిర్ధారించుకొని సమయం వచ్చినప్పుడు తగురీతిలో స్పందించవలసి ఉంటుంది. 


Related Post