భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ నాదేనని వాదిస్తుంటుంది. అప్పుడప్పుడు భారత్ భూభాగంలోకి జొరబడి అక్కడ తమ దేశ జెండా పాతి వికృతానందం పొందుతుంటుంది. టిబెట్, తైవాన్ లపై అప్పుడప్పుడు రంకెలు వేస్తుంటుంది. జపాన్ సమీపంలో ఉన్న దీవుల మావే అని వాదిస్తుంటుంది. దక్షిణ మహా సముద్రం కూడా నాదే నని వాదిస్తుంటుంది. దాని కోసం అమెరికాతో యుద్ధం చేయడానికైనా సిద్దం అంటుంది.
ఈ ఉదాహరణలన్నీ చైనా రాజ్యకాంక్షకి నిదర్శనంగా కనబడుతుంటాయి. కానీ భారత్ ఏనాడు తన సరిహద్దులకి అవతల ఉన్న భూభాగాన్ని ఆశించదు. తన సరిహద్దులలో ఎవరూ ప్రవేశించకుండా ఉంటే అదే పదివేలు అని సంతోషిస్తుంటుంది.
భారత్, చైనా, పాకిస్తాన్ మూడు దేశాలు అణ్వస్త్రాలను ప్రయోగించగల క్షిపణులను అప్పుడప్పుడు పరీక్షించి చూసుకొంటాయి. ఇటీవలే భారత్ అగ్ని క్షిపణిని పరీక్షించి చూడగా, పాక్ కూడా క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చెప్పుకొంది. అయితే భారత్ ఎప్పుడు తన అస్త్రశస్త్రాలను పరీక్షించుకోవడానికే పరిమితం అవుతుంది తప్ప కవ్వింపు చర్యలకు పాల్పడదు. కానీ అమెరికాపై యుద్దానికి ఉవ్విళ్ళూరుతున్న చైనా దానిని కవ్విస్తున్నట్లుగా తాజాగా ఒక క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతంగా చేసింది. దానితో అమెరికాపై ఒకేసారి 10 అణ్వస్త్రాలను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదు. ఈ విషయాన్ని అమెరికా కూడా గుర్తించింది కానీ ఎందుకో స్పందించలేదు.
సరిగ్గా ఇదే సమయంలో భారత్ ఒక గొప్ప ప్రయోగం చేయబోతోంది. దానికోసం అమెరికా, చైనాలతో సహా ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈనెల 15వ తేదీన ఇస్రో సంస్థ వివిధ దేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలో వాటికి నిర్దేశించిన వేర్వేరు కక్ష్యలలో ప్రవేశపెట్టబోతోంది. ఈ ప్రయోగం విజయంవంతం అయినట్లయితే ఇక అంతరిక్ష వ్యాపార రంగంలో భారత్ కి ఇక తిరుగే ఉండదు. ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అనేక ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల ఏకైక సంస్థగా ఇస్రో నిలుస్తుంది. భారత్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, మేధస్సుతో యావత్ ప్రపంచదేశాలకి సేవలందిస్తుంటే, చైనా తనకున్న పరిజ్ఞానాన్ని ప్రపంచ వినాశనానికి ఉపయోగించాలనుకొంటోంది. తను తలుచుకొంటే ఒక దేశాన్నే నామరూపాలు లేకుండా చేయగలనని నిసిగ్గుగా చాటుకొంటోంది. అదే భారత్, చైనాలకున్న ప్రధానమైన తేడా.