దానికి చట్టబద్దత...ఎందుకు? ఏమి ప్రయోజనం?

January 31, 2017


img

ఏపికి ప్రత్యేక హోదాకు బదులు ఇచ్చిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ వలననే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కేంద్రప్రభుత్వం తరపున తెదేపా ప్రభుత్వమే వకల్తా పుచ్చుకొని గట్టిగా వాదిస్తోంది. ఒకప్పుడు హోదా కోసం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించిన తెదేపాయే ఇప్పుడు వెంకయ్య నాయుడుతో కలిసి “అది గడిచిపోయిన అధ్యాయం” అని కోరస్ పాడుతోంది. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని కేంద్రంతో గట్టిగ పోరాడామని, మరో రెండు వారాలలో చట్టబద్దత కల్పించబడుతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. దానితో బాటు విశాఖలో రైల్వే జోను ఏర్పాటు తదితర హామీల అమలుకోసం కూడా కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని ప్రజలను మభ్యపెడుతూ తెదేపా రెండున్నరేళ్ళు కాలక్షేపం చేసేసి, ఇప్పుడు ‘అది గతించిన అధ్యాయం’ అని, ప్యాకేజీకి చట్టబద్దత కల్పించడం చాలా గొప్ప విషయం అన్నట్లు చెపుతోంది. కానీ నిజానికి ఏపికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో కొత్తగా, అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. విభజన చట్టంలో ఏపికి ఏమేమి హామీలు ఇవ్వబడ్డాయో వాటన్నిటినీ మళ్ళీ అందులో పేర్కొని, వాటిన్నిటినీ తప్పక అమలుచేస్తామని మాత్రమే దానిలో పేర్కొంది. ఇంతవరకు ఇచ్చిన నిధులు, శంఖుస్థాపనలు చేసిన ఉన్నత విద్యాలయాలు, సంస్థల జాబితాలు, రాష్ట్రానికి మంజూరు చేసిన నిధుల వివరాలను దానిలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకి 100 శాతం నిధులు ఇస్తున్నట్లు తెదేపా, భాజపా నేతలు చెపుతున్న మాట కూడా నిజం కాదు. దానిలో సాగునీటి పనులకు మాత్రమే 100 శాతం నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే పోలవరం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి, విశాఖలో పరిశ్రమలకు అవసరమైన నీటిని తరలించేందుకు, ఇతర అవసరాల కోసం జరిగే నిర్మాణపనులకు, కేంద్రప్రభుత్వం నిధులు ఈయదని స్పష్టం అవుతోంది. 

ఇటువంటి ప్యాకేజీని మహాద్భుతమైనదిగా వర్ణిస్తూ దాని వలన రాష్ట్రానికి వేలకోట్లు వచ్చి పడిపోతాయన్నట్లుగా తెదేపా, భాజపా నేతలు ఆంధ్రా ప్రజలను మభ్యపెడుతున్నారు. పైగా దానికి చట్టబద్దత కల్పించడం కోసం కేంద్రంతో పోరాడుతున్నామని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఈ విషయాలన్నీ వైకాపా అధినేత జగన్ కు బాగానే తెలుసు. కానీ ఆయన ఈ హోదా అంశాన్ని తన ప్రియశత్రువు చంద్రబాబు నాయుడుపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి తను అధికారంలోకి వచ్చేయాలని తహతహలాడుతున్నారు తప్ప ప్రత్యేక హోదాను సాధించాలనే చిత్తశుద్ధితో పోరాటాలు చేయడం లేదు. 

జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బరిలో దిగారు కానీ ఆయన రాజకీయ అపరిపక్వత, రెండు పడవల ప్రయాణం కారణంగా అయన పోరాటాలు కూడా అగమ్యంగా సాగుతున్నాయి. వారిద్దరూ గణతంత్ర దినోత్సవం రోజున చాలా హడావుడి చేశారు. మళ్ళీ ఆ తరువాత ఆ ఊసే లేదు. ప్రతిపక్షాల ఈ బలహీనతలే తెదేపా, భాజపాలకు శ్రీరామరక్షగ నిలుస్తునాయని చెప్పవచ్చు. అధికార, ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేకపోవడం ప్రజల దురదృష్టం. 


Related Post