అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 7 ముస్లిం దేశాలపై నిషేధం విదిస్తూ జారీ చేసిన ఆదేశాలలో, పాకిస్తాన్ నుంచి వచ్చే వారి పట్ల కూడా మరింత కటినంగా వ్యవహరించబోతున్నట్లు స్పష్టం చేశారు. అది పాక్ కు తొలి హెచ్చరిక వంటిదేనని చెప్పకనే చెప్పారు. కనుక పాక్ ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమయ్యి తమ గడ్డ మీద స్వేచ్చగా తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ అతని అనుచరులను గృహ నిర్బంధం చేసి, వారి కార్యాలయాలను స్వాధీనం చేసుకొంది.
హఫీజ్ సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ కోరుతుంటే, పాక్ ప్రోదబలంతో దానిని చైనా అడ్డుకొంటున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అదే వ్యక్తిని పాక్ ప్రభుత్వమే స్వయంగా గృహ నిర్బంధం చేయడం గమనిస్తే అతనొక ఉగ్రవాది అని, అతనికి పాక్ ప్రభుత్వమే ఆశ్రయం, సహాయసహకారాలు అందిస్తోందని అంగీకరించినట్లయింది. అయినా ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం కావాలా? పాక్ వక్ర బుద్ధిని తెలుసుకొనేందుకు నిదర్శనలు అవసరమా?
భారత ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోనేందుకే డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పై ఈవిధమైన ఒత్తిడి తెస్తున్నారని ఉగ్రవాది హఫీజ్ సయీద్ చేసిన ఆరోపణలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, భారత్ మరియు దాని ప్రధాని నరేంద్ర మోడీ శక్తిని, ప్రభావాన్ని పాక్ బాగానే గుర్తించినట్లు అర్ధం అవుతోంది. కనుక భారత్ పట్ల కూడా దాని తీరు మార్చుకొంటే బాగుంటుంది.
కానీ హఫీజ్ సయీద్ ని గృహ నిర్బంధం చేసినంత మాత్రాన్న పాక్ ప్రభుత్వం ట్రంప్ ను చూసి భయపడిపోతుందని అనుకోనవసరం లేదు. అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకొనే అలవాటున్న పాకిస్తాన్, ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా లేవనే సంగతి గ్రహించి ట్రంప్ ను ప్రసన్నం చేసుకొనేందుకే హఫీజ్ సయీద్ ను అరెస్ట్ చేసింది తప్ప అతని వల్ల తమకు ప్రమాదం ఉందనీ కాదు.. అతను తమ శత్రువనో లేక ఉగ్రవాది అని భావిస్తోందని దానర్ధం కాదు. ఉగ్రవాదంపై పోరు కోసం అమెరికా ఏటా పాకిస్తాన్ కు లక్షల కోట్లు ఆర్ధిక సహాయం చేస్తుంటుంది. పాక్ ప్రభుత్వం బహుశః దాని కోసమే హఫీజ్ ను అరెస్ట్ చేసి చూపించి ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు.
గతంలో పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు, ప్రపంచ దేశాల ఒత్తిడి భరించలేక పాక్ ప్రభుత్వం హఫీజ్ ను ఈవిధంగానే గృహనిర్బందం చేసింది. ఆ వేడి చల్లారగానే మళ్ళీ వదిలిపెట్టేసింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. చేయబోతోంది. ఒకవేళ ట్రంప్ ప్రసన్నం కాకపోతే, నిధులు విదిలించకపోతే అప్పుడు హఫీజ్ సయీద్ ను విడిచిపెట్టేసి, అమెరికాపై కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో చేతులు కలపడం తధ్యం. కనుక వక్రబుద్ధి ఉన్న పాకిస్తాన్ ట్రంప్ దెబ్బకు దిగివచ్చింది అనుకొంటే అది అమాయకత్వమే అవుతుంది.