ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తుండటంతో, “ఆయన ఎప్పుడూ మా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప రాష్ట్రానికి ఇబ్బందులు సృష్టిస్తున్న ఏపి సర్కార్ ని ఎందుకు ప్రశ్నించరు? అది హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ ఎందుకు నిలదీయరు?” అని తెరాస ప్రొఫెసర్ కోదండరామ్ ని ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టింది.
అయితే ఆయన ఏపి సర్కార్ ని ప్రశ్నించలేదు కానీ తెరాస సర్కార్ అన్ని పనులు ఆంధ్రా కాంట్రాక్టర్లకే అప్పగిస్తోందని, చివరికి రోడ్లు తుడవడం వంటి చిన్న చిన్న పనులను కూడా వాళ్ళకే ఎందుకు అప్పగిస్తోందని ప్రశ్నించారు. ఆంధ్రా పాలనకు స్వస్తి చెప్పాలనే కోట్లాడి తెలంగాణా సాధించుకొంటే, తెరాస సర్కార్ మళ్ళీ వాళ్ళనే నెత్తిన పెడుతోందని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. ఒకప్పుడు తెలంగాణా రాష్ట్రం వద్దన్నవాళ్ళనే ఇప్పుడు తెరాస సర్కార్ చంకనెక్కించుకొందని విమర్శించారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పనులు చేయడానికి తెలంగాణా కాంట్రాక్టర్లు, కార్మికులు దొరకరా? తెలంగాణా వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయనుకొంటే కేవలం 1500-2000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. మిగిలినవాటిని ఏ కాకి ఎత్తుకుపోయింది? అని ప్రశ్నించారు.
తెరాస తరపున ఆయనకు జవాబులు చెప్పే బాధ్యత తీసుకొన్న ఎంపి బాల్క సుమన్ ఈ విమర్శలపై స్పందిస్తూ “తెలంగాణా జెఎసి ఒక రాజకీయ నిరుద్యోగుల సంఘం. ప్రొఫెసర్ కోదండరామ్ వారికి చైర్మన్. తెలంగాణాలో ఉద్యోగాలాను ఏ కాకీ ఎత్తుకు వెళ్ళలేదు కానీ ఆయననే కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోయింది. అందుకే ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి వేదికలు పంచుకొంటూ మా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకొన్నట్లు కనిపిస్తున్నారు. అయితే అది సాధ్యం కాదు. కోదండరామ్ పోరాడవలసింది రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మాపై కాదు..రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీమీద..రెండున్నరేళ్ళు గడిచినా ఇంకా ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయని కమలనాధన్ కమిటీని నిలదీయాలి. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని కేంద్రాన్ని నిలదీయాలి. హైకోర్టు విభజనకు సహకరించని చంద్రబాబు నాయుడుతో పోరాడాలి,” అని అన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్, తెరాస పరస్పరం చేసుకొంటున్న ఈ విమర్శలలోనే లోపాలు ఎక్కడ ఉన్నాయో కనబడుతున్నాయి. కానీ వాటిని పరిష్కరించుకొనే బదులు ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటున్నారు. వాటి వలన ప్రయోజనం ఉండదు..ప్రజల దృష్టిలో చులకన అవడం మినహా అని గుర్తించితే బాగుంటుంది కదా.