ఒక మేధావి మంచివాడు కానవసరం లేదు. అలాగే ఒక మంచివ్యక్తి మంచి భర్త కాలేకపోవచ్చు. రకరకాల వ్యాపారాలలో వేల కోట్లు సంపాదించి గొప్ప వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకొన్న డోనాల్డ్ ట్రంప్ ఒక గొప్ప అమెరికా అధ్యక్షుడుగా కాలేకపోవచ్చని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల వ్యవధిలోనే ట్రంప్ తన నిర్ణయాలతో అమెరికాను, యావత్ ప్రపంచాన్ని షేక్ చేసేస్తున్నారు. అవి సానుకూల నిర్ణయాలే అయ్యుంటే, యావత్ ప్రపంచం అయన మేధస్సుకు దాసోహం అని ఉండేది. కానీ ఆ సంచలన నిర్ణయాలు ఎవరికీ ఆమోదయోగ్యం కాకపోవడంతో సర్వత్రా విమర్శలే వినిపిస్తున్నాయి.
అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచంలో ఏ ఒక్కరూ వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఎందుకంటే ఏ దేశమైనా ముందుగా తన పౌరులకే అన్ని విధాల లబ్ది కలగాలని కోరుకొంటుంది కనుక. అమెరికన్ కంపెనీలలో అమెరికన్లని పక్కన పెట్టి, విదేశీయులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎవరూ కోరుకోరు. కనుక అమెరికా పౌరుడికే మొదటి ప్రాధాన్యత ఈయడం ధర్మం. అయితే వందల సంవత్సరాలుగా అనేక కోట్లమంది విదేశీయులు అందరూ కలిసి అమెరికాను ఈ స్థాయికి తీసుకువచ్చారనేది చరిత్ర చెపుతున్న విషయమే. అగ్రరాజ్యంగా ఎదిగిన అమెరికాకు ఇప్పుడు ఎవరి అవసరం లేకపోవచ్చు. కానీ అంత మాత్రాన్న అందరితో అనుచితంగా వ్యవహరించనవసరం కూడా లేదు.
దశాబ్దాలుగా అమెరికాలో నెలకొన్న విధానాలను మార్చుకొని అమెరికన్లకు అగ్ర తాంబూలం ఇవ్వాలనుకొంటే, అది రాత్రికి రాత్రే సాధ్యం అయ్యే పనే కాదు. ఒక బారీ వ్యవస్థలో క్రమంగా ఒక ప్రణాళికాబద్దంగా మార్పులను చేయడం మొదలుపెడితే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కానీ రాత్రికి రాత్రి చేయాలని ప్రయత్నిస్తే వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయంతో భారత్ ఆర్ధిక వ్యవస్థ దాదాపు కుప్పకూలే ప్రమాదస్థితి వరకు వెళ్ళి బయటపడిన సంగతి అందరూ కళ్ళారా చూశారు. అదేవిధంగా అమెరికన్లను ఉద్యోగాలు ఇచ్చేందుకు, విదేశీయులను రాకుండా చేసి, దేశంలో ఉన్నవారిని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేసినట్లయితే, వారిపై ఆధారపడిన ఆ వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.
ఐటి, సాంకేతిక రంగాలలో అమెరికాకు సాటి లేకపోవచ్చు కానీ వాటిని నడిపిస్తున్నవారిలో భారత్ తో సహా వివిధ దేశాలకు చెందిన వారే ఎక్కువనేది బహిరంగ రహస్యమే. వారందరినీ పంపిచేసి వారి స్థానంలో అమెరికన్లను తీసుకోవాలనుకొంటే ఆ సంస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అలాగే బయట నుంచి ఎవరూ అమెరికా రాకూడదనుకొంటే నష్టపోయేది కూడా అమెరికాయే. ఎందుకంటే, ఏ రంగంలోనైనా అత్యుత్తమ నైపుణ్యం, మంచి తెలివి తేటలు ఉన్నవారికి మాత్రమే అమెరికా సంస్థలు ఉద్యోగాలు ఇస్తుంటాయి. వారిని వద్దనుకొంటే, అమెరికాలో అంతే నైపుణ్యం, తెలివితేటలు, కష్టపడేగుణం ఉన్నవారిని తప్పనిసరిగా చూసుకోవలసి ఉంటుంది. అమెరికన్లలో ఆ మూడు గొప్ప లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనే దానిలో భిన్నాభిప్రాయాలు లేవు కానీ వారి జీవన ప్రమాణాలకు ఏమాత్రం సరిపోని తక్కువ జీతాలకు వారు పనిచేస్తారా లేదా? అనేది అనుమానమే. ఈ ఒక్క కారణం చేతనే అమెరికాలో సంస్థలు విదేశీయులకి ఉద్యోగాలు ఇస్తున్నాయి. కనుక ఆ విదేశీయుల స్థానంలో అమెరికన్లను నియమించుకొనే ప్రక్రియకు కొన్ని సంవత్సరాలు నిర్దిష్టమైన గడువు పెట్టుకొని అమలుచేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు కనబడతాయి. కాదని తొందరపాటు ప్రదర్శిస్తే మొదట అమెరికా, తరువాత దానిపై ఆధారపడిన దేశాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.