బాబు మెడకు జల్లికట్టు?

January 21, 2017


img

తమిళనాడు ప్రజలు జల్లికట్టు కోసం కేంద్రంతో కోట్లాడి ఆర్డినెన్స్ తెప్పించుకొన్నారు. దాని వలన ఆ రాష్ట్రానికి కొత్తగా ఒరిగేదేమీ లేకపోయినా దానితో వారి పోరాటపటిమ ఏమిటో దేశానికి రుచి చూపించారని చెప్పక తప్పదు. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు’ అక్కడ వారి జల్లికట్టు పోరాటం విజయవంతం అవడం ఏపిలో చంద్రబాబు నాయుడు మెడకు తాడులా చుట్టుకోవడం విశేషం. 

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక బహిరంగ లేఖ వ్రాశారు. దానిలో “తమిళనాడు ప్రజలు అందరూ కలిసికట్టుగా పోరాడి, చట్ట వ్యతిరేకమైన జల్లికట్టు క్రీడపై ఉన్న నిషేధాన్ని నాలుగు రోజుల్లోనే ఎత్తివేయించుకోగాలిగారు. మరి మనకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పితే దాని కోసం ఇదేవిధంగా అందరం కలిసి ఎందుకు పోరాడలేకపోతున్నాము? మన అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన భావితరాలకు నష్టం కలుగకూడదు. మీరు నాయకత్వం వహిస్తే అందరం కలిసి కేంద్రప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించుకొందాము. అలాగ చేస్తే చరిత్రలో మీ పేరు శాస్వితంగా నిలిచిపోతుంది,” అని వ్రాశారు. 

ఏపికి ప్రత్యేక హోదా రాదనే సంగతి చంద్రబాబుకి రెండేళ్ళ క్రితమే తెలుసు. కానీ ఆ సంగతి బయటకు చెప్పి ప్రజాగ్రహానికి గురికావడం ఎందుకని అందరితో కలిసి అప్పుడప్పుడు కేంద్రాన్ని నిలదీస్తున్నట్లు నటించేవారు. ప్రత్యేక హోదా రాదని ఆయనకు ఖచ్చితంగా తెలుసు కనుకనే ఆర్ధిక ప్యాకేజీ కోసం మాట్లాడుతున్నారని తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి చాలా కాలం క్రితమే చెప్పేరు. చివరికి ఆయన చెప్పినట్లుగానే చంద్రబాబు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని తీసుకొని ప్రత్యేక హోదా హామీని మరిచిపోయారు. పనిలోపనిగా దాని వలన రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం లేదని కూడా సర్టిఫికేట్ జారీ చేశారు. హోదా విషయంలోనే కాదు..విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలోను చంద్రబాబు ఇదేవిధంగా దాగుడుమూతలు ఆడుతూ కాలక్షేపం చేసేస్తున్నారు. ‘నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న వాడిని ఎవరు లేపలేనట్లే’, అన్నీ తెలిసి తెలియనట్లు నటిస్తున్న బాబుని ప్రత్యేక హోదా కోసం కొట్లాడుదాం రమ్మని పిలిస్తే వస్తాడా? రాడు. ఆయన లెక్కలు ఆయనకుంటాయి కదా! 


Related Post