యూపిలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో దానికే అర్ధం కావడం లేదు. ఆ రాష్ట్రంలో గత 27సం.లుగా అధికారానికి దూరంగా ఉంటూ చాలా భారంగా గడుపుకొస్తోంది. కనుక ఈసారి ఎన్నికలలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కు ఆ బాధ్యత అప్పగించింది. ఆయన సూచన మేరకు పట్టుమని 10 నిముషాలు గట్టిగా నిలబడలేని వృద్దురాలైన షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీతో అతిరధ మహారధుల వంటివారు ఎందరో సీనియర్ నేతలు ఉండగా వృద్దురాలైన ఆమెను ఎంపిక చేయడంతోనే కాంగ్రెస్ మొదటి తప్పు చేసింది. నాలుగైదు నెలల క్రితమే సోనియా గాంధీ వారణాసిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోయారు. కానీ ఆకస్మాత్తుగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అన్నీ అపశకునాలే మొదలయ్యాయి.
అధికార సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు పెట్టుకొందామని ఆశపడితే, దానిలో తండ్రీకొడుకులు ఇద్దరూ నిన్న మొన్నటివరకు కీచులాటలలో మునిగితేలారు. చివరికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే ఆ పార్టీ పగ్గాలు దక్కినప్పటికీ, ఆయన తమతో పొత్తుల కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీని పట్టించుకోకుండా అప్పుడే 210 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కూడా విడుదల చేసేసి షాక్ ఇచ్చారు. ప్రియాంకా వాధ్రా స్వయంగా అఖిలేష్ యాదవ్ కు ఫోన్లు, మెసేజులు చేస్తున్నా వాటినీ అయన పట్టించుకోవడం లేదని సమాచారం.
కుంటి, ముసలి గుర్రం వంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే దానిని కూడా తామే మోయవలసి ఉంటుందని అఖిలేష్ యాదవ్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోరినట్లు 100-138 సీట్లు దానికి కేటాయించినట్లయితే, అది ఎలాగు అన్ని సీట్లు గెలవలేదు కనుక దాని వలన తాము కూడా ఓడిపోవలసి వస్తుందని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నందునే కాంగ్రెస్ పార్టీని దూరంగా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అఖిలేష్ యాదవ్ కనికరించి 20-30 సీట్లు కేటాయిస్తే అదే మహాప్రసాదం అని కాంగ్రెస్ స్వీకరించక తప్పదు. ఒకవేళ ఆయన దానిని నిరాకరిస్తే, ఇక కాంగ్రెస్ పార్టీ యూపిలో ఏకాకిగా మిగిలిపోతుంది. అప్పుడు కనీసం 5-10 స్థానాల కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోవచ్చు.
ఒకప్పుడు దేశాన్ని తన కనుసన్నలలో ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుస్థితి ఎదురవడం చూస్తుంటే జాలి కలుగుతుంది. కానీ అది స్వయంకృతాపరాధమే కనుక అది ఎవరిని నిందించలేదు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని పక్కన పెట్టి సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకోలేకపోతే దానికి ఇటువంటి చేదు అనుభవాలే పునరావృతం అవుతుంటాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అది ఎక్కడా పోటీ చేయలేని దుస్థితి ఏర్పడవచ్చు.