ఆ బిల్లు భవిష్యత్ అప్పుడే తేలిపోయింది!

January 21, 2017


img

రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా వచ్చే బడ్జెట్ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వెంటనే దానిపై భాజపా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పేసింది. భద్రాచలంలో నిన్నటి నుంచి మొదలైన భాజపా రెండు రోజుల సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పి.మురళీధర్ రావు తదితరులు అందరూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ముస్లింల ఓట్లు కోసమే ఈ బిల్లుని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. తమ పార్టీ తెరాస ప్రభుత్వం ప్రయత్నాలను గట్టిగా అడ్డుకొంటుందని వారు స్పష్టం చేశారు. 

కనుక ముస్లిం రిజర్వేషన్ల బిల్లు ఇంకా ప్రవేశపెట్టక మునుపే దానికి ఏ గతి పట్టబోతోందో అర్ధం అవుతోంది. దానిని రాష్ట్ర శాసనసభ ఆమోదించి కేంద్రం ఆమోదం కోసం పంపితే దానిపై కేంద్రం ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా పక్కన పడేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఈ బిల్లు కోసం తెరాస సర్కార్ గట్టిగా పట్టుబడితే భవిష్యత్ లో తెరాసతో ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోవచ్చు. తమ పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే పోరాడుతుందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ నిన్న జరిగిన సభలో ప్రకటించడమే అందుకు మొదటి సూచనగా భావించవచ్చు. కానీ తెరాసతో పొత్తులు పెట్టుకోకపోతే తెరాసకు ఏమీ నష్టం ఉండదు. భాజపాకే ఎక్కువ నష్టం కలుగవచ్చు కనుక దీనిపై ఎన్నికలు దగ్గర పడిన తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ముస్లిం రిజర్వేషన్ల బిల్లుకి మాత్రం మోక్షం వచ్చే లేదనే భావించవచ్చు. 


Related Post