అవును. ఆ పార్టీ యజమాని ఎవరో ఇంకా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దం అవుతోంది. అదే..యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీ. అది నాదంటే కాదు నాదని ములాయం, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కీచులాడుకొంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర పంచాయితీ పెట్టారు. అది ఇంకా తేలలేదు. ఆ ఇద్దరినీ బలనిరూపణ చేసుకోవలసిందిగా ఈసీ కోరడంతో తండ్రీకొడుకులిద్దరూ అందుకు సిద్దం అవుతున్నారు. ఈలోగానే కొడుకు కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులకు బేరం సెటిల్ చేసుకొని విదేశాలకు వెళ్ళిన రాహుల్ గాంధీ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు తండ్రికొడుకులు పార్టీపై ఆదిపత్యం కోసం కత్తులు దూసుకొంటూనే మళ్ళీ రోజూ జోరుగా చర్చలు కూడా సాగించడం మరో విశేషం. వారిద్దరి మద్య చిచ్చు రగిల్చిన ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ఇవ్వాళ్ళ అఖిలేష్ తో చర్చలు జరిపాడు. తరువాత ఆ సారాంశాన్ని పెద్దాయన చెవిన వేయడానికి వెళ్ళారు.
పార్టీపై ఆధిపత్యమే కాకుండా ఎన్నికలలో తను ఎంపిక చేసిన అభ్యర్ధులకే టికెట్లు కేటాయించాలని పిల్లాడు పట్టుబడుతుండటంతో తండ్రీకొడుకుల మద్య రాజీ కుదరడం లేదు. రాజీ కుదిరినా కుదరకపోయినా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని 403 సీట్లలో దానికి సుమారు 100 సీట్లు ఇచ్చేయడానికి రెడీ అయిపోయారని వార్తలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 11 నుంచి యూపిలో ఎన్నికలు మొదలవుతాయి. ఇంతవరకు ఆ పార్టీ ఎవరిదో తెలియదు. దాని తరపున ఎవరు ప్రకటించే అభ్యర్ధులు పోటీ చేస్తారో తెలియదు. తండ్రీకొడుకులు కలిసి ఉంటారో లేక విడిపోతారో కూడా తెలియదు. ఎన్నికలు ఇంకా నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు అధికార పార్టీ ఈ దుస్థితిలో ఉండటం చాలా విచిత్రంగానే ఉంది. అటువంటి పార్టీ రాష్ట్రంలో 27 ఏళ్ళుగా అధికారంలోకి రాలేకపోతున్న కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి సిద్దం అవుతోంది. రెండు పార్టీలు చేతులు కలిపితే జనాలు గ్యారంటీగా తమకే కళ్ళు మూసుకొని ఓట్లు గుద్దేస్తారని అఖిలేష్, రాహుల్ కలలు కంటున్నారు. గ్రేట్!