విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి శాసనసభలో నిన్న జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసేందుకు నిధుల కొరత ఒక్కటే కారణం కాదని, దాని అమలు చేయడానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని నియమనిబంధనలు కూడా కారణమని అర్ధం అవుతుంది.
ఉదాహరణకు ఒక విద్యార్ధికి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలంటే, ఆ విద్యార్ధికి కనీసం 75శాతం హాజరుతో పాస్ అవ్వవలసి ఉంటుంది. అంటే విద్యార్ధులు ఒక ఏడాది చదువు పూర్తి చేసిన తరువాత గానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసే అవకాశం లేదన్నమాట. సాధారణంగా తల్లితండ్రులు తమ పిల్లలను కాలేజీలలో చేర్పించేటప్పుడు ఫీజుల కోసం డబ్బుకి చాలా ఇబ్బందులు పడుతుంటారు. కనుక వారికి చాలా అవసరమైన ఆ సమయంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసినట్లయితే అది వారికి ఎక్కువ ఉపయోగపడి ఉండేది. కానీ ఒక సంవత్సరం చదువు పూర్తి చేసుకొన్న తరువాత చెల్లించడం విడ్డూరంగానే ఉంది.
ప్రభుత్వం ఇస్తున్న ఆ ఆర్ధికసహాయం దుర్వినోయోగం, నిరుపయోగంగా మారకూడదనే ఆలోచనతోనే ఆ నిబంధన పెట్టి ఉండవచ్చు. కానీ విద్యార్ధులకు నిజంగా చాలా అవసరమైనప్పుడు దానిని అందించగలిగేవిధంగా ఆ నిబంధనలను మార్చవచ్చు కదా? కానీ ఆ లోపాలను సవరించకుండా తమ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ విధానాలనే అనుసరిస్తోందని వాటిలో ఎటువంటి మార్పులు చేయలేదని స్వయంగా ముఖ్యమంత్రే శాసనసభలో చెప్పుకోవడం విచిత్రంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం చెల్లిస్తున్నప్పటికీ ఇటువంటి నిబందనల వలన అది విద్యార్ధులకు అవసరమైనప్పుడు చేతికి అందడం లేదు. ఆ కారణంగా విద్యార్ధులు, ప్రతిపక్షాలు కూడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
గత ప్రభుత్వాలు చాలా తప్పులు చేశాయని, చాలా అసమర్ధంగా వ్యవహరించాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెరాస మంత్రులు చాలా మంది తరచూ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు మళ్ళీ ఆ అసమర్ధ కాంగ్రెస్ విధానాలనే అనుసరించడం ఎందుకు? విద్యార్ధులు, ప్రతిపక్షాల చేత మాటలు పడటం దేనికి? ఏ నియమనిబందనలైనా కూడా అవినీతి, అక్రమాలు జరుగకుండా అడ్డుకొని అర్హులైన విద్యార్ధులకు అన్ని విధాలా సహాయపడటం కోసమే అయినప్పుడు విద్యార్ధులకు ఎక్కువ ఉపయోగపడే విధంగా, దాని వలన ప్రభుత్వానికి ప్రజలలో మంచి పేరు వచ్చే విధంగా రూపొందించుకొంటే మంచిది కదా?