ఖమ్మంలో తెదేపా దుకాణ్ బంద్?

January 06, 2017


img


రాష్ట్రంలో ఇప్పటికే తెదేపా చాలా బలహీనపడింది. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక మళ్ళీ వాటి గురించి వల్లె వేసుకొనక్కరలేదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తెదేపా దుఖాణం బంద్ అయిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇంతకు ముందు తెదేపాకు ఖమ్మం జిల్లా కంచుకోటగా ఉండేది. జిల్లాలో అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఇద్దరు హేమాహేమీలైన నేతలు తెదేపాలో ఉండేవారు. వారిద్దరికీ పడనప్పటికీ జిల్లాలో పార్టీని చాలా బలోపేతం చేశారు. 

కానీ చంద్రబాబు నాయుడు నామా నాగేశ్వరరావుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో తుమ్మల క్రమంగా పార్టీకి దూరం అయ్యి చివరికి తెరాసలో చేరిపోయి రోడ్లు, భవనాల శాఖా మంత్రి అయిపోయారు. ఆ తరువాత జిల్లాలో, రాష్ట్రంలో కూడా తెదేపా చాలా బలహీనపడటంతో ఇప్పుడు నామా నాగేశ్వరరావు కూడా పార్టీ వీడాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద వ్యాపారవేత్త అయిన నామా వాటిని కాపాడుకోవడం కోసం ఏదో ఒక బలమైన రాజకీయ పార్టీ అండదండలు అవసరం ఉండాలనుకోవడం సహజం. 

తను వ్యతిరేకిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు తెరాసలో ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి సన్నిహితంగా ఉంటున్నారు కనుక తెరాసలోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఇక కాంగ్రెస్ లేదా భాజపాలలో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్ళదలిస్తే అక్కడ రేణుకా చౌదరితో ఎంపి టికెట్ కోసం పోటీ పడవలసి ఉంటుంది. ఆ పార్టీలో చాలా సీనియర్ అయిన ఆమెను కాదని కొత్తగా వచ్చిన నామాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ఆశించలేరు. 

కనుక ఇక మిగిలింది భాజపా. దానిలో అయితే అసలు ఆయన స్థాయి గల నేతలే లేరు. పైగా కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ కేంద్రంలో భాజపాయే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపాలోకి మారినట్లయితే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు కనుక వారి మద్య సంబందాలు యధాప్రకారం బలంగా కొనసాగవచ్చు. ఇదివరకు ఎంపిగా చేసి ఉన్నందున జాతీయ స్థాయిలో భాజపా నేతలతో కూడా నామాకు మంచి పరిచయాలే ఉన్నాయి. కనుక ఒకవేళ అయన కనుక పార్టీ మారేమాటయితే భాజపాలోకే వెళ్ళే అవకాశాలున్నాయని భావించవచ్చు. ఒకవేళ ఆయన కూడా వెళ్ళిపోతే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ‘నామ’ మాత్రంగా తెరిచి ఉన్న తెదేపా దుఖాణం పూర్తిగా బంద్ అయిపోతుంది.


Related Post