ఒకప్పుడు మజ్లీస్, కాంగ్రెస్ పార్టీలు దోస్తులుగా ఉండేవి కానీ కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కటీఫ్ చెప్పేసుకొన్నాయి. తెలంగాణా ఏర్పడిన తరువాత మజ్లీస్ పార్టీ తెరాసకు దగ్గరైంది. తెరాసకు కూడా దాని అవసరం ఉండటంతో రెండూ కొంత కాలం క్రితం వరకు సఖ్యతగానే సాగాయి. గత కొన్ని నెలలుగా తెరాస భాజపాకు దగ్గరవుతుండటంతో మజ్లీస్ దూరం కాసాగింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. మజ్లీస్ పార్టీకి గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ లో తెరాస పాగా వేసినప్పటి నుంచే దానిలో ఆ మార్పు మొదలైందని చెప్పుకోవచ్చు.
ప్రధాని నరేంద్ర మోడీ గజ్వేల్ పర్యటన సందర్భంగా తెరాస, భాజపాల మద్య బంధం ఇంకా బలపడినట్లే కనిపిస్తోంది. ఆ తరువాత నుంచే తెరాస ప్రభుత్వంపై భాజపా విమర్శల జోరు పూర్తిగా తగ్గిపోయింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో గట్టిగా సమర్ధించడం ద్వారా తాము మిత్రపక్షాలమే అనే అభిప్రాయం కలిగించారు.
అందుకే మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో నోట్ల రద్దుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ “తెరాస సర్కార్ కేంద్రానికి వంతపాడుతూ మరీ అంత విధేయత ప్రకటించనవసరం లేదు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, పరిష్కరించే ప్రయత్నాలు చేయకుండా వారిని నగదు రహిత లావాదేవీలు చేయమని బలవంతం చేయడం సరికాదు,” అని కేసీఆర్ కి చురకలు వేశారు.
మళ్ళీ నిన్న శాసనసభలో అదే అంశంపై మాట్లాడుతూ, “ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీ 50 రోజులు గడువు అడిగారు కనుక అందరం అంత వరకు ఓపిక పట్టాలని కేసీఆర్ వత్తాసు పలుకుతూ మాట్లాడారు. ఆ గడువు పూర్తయిపోయింది కానీ ప్రజల కష్టాలు తీరలేదు. దీనికి కేసీఆర్ ఏమి సమాధానం చెపుతారు?” అని ఓవైసీ ప్రశ్నించారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ కి శాసనసభలో తనను పొగిడేవారి మాటలే నచ్చుతాయి. ప్రజా సమస్యల గురించి ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినేందుకు ఇష్టపడరు. విద్యార్ధులు అందరూ ఇంజనీరింగ్ లేదా మరొక కోర్సులనే చదవాలనుకోవడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. ఒక విద్యార్ధి ఏది చదవాలనే విషయం కూడా ఆయనే నిర్ణయిస్తారా?”అని ఓవైసీ ప్రశ్నించారు.
ఓవైసీ వేస్తున్న ఈ ప్రశ్నలు ఆ సమస్య పరిష్కారం కోసం అడుగుతున్నవి కావు. భాజపాకు దగ్గరవుతున్న తెరాస సర్కార్ పట్ల అసంతృప్తికి నిదర్శనంగానే చూడవలసి ఉంటుంది. ఒకవేళ భాజపాకు దగ్గర కాకపోయుంటే ఇటువంటి ప్రశ్నలు అడిగి ఉండేవారే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే మజ్లీస్ అసంతృప్తిని కేసీఆర్ పట్టించుకోనవసరం లేదిప్పుడు. ఎందుకంటే, గ్రేటర్ హైదరాబాద్ కూడా ఇప్పుడు తెరాస వశమయింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో మజ్లీస్ ప్రభావం అంతంతమాత్రమేనని అందరికీ తెలుసు. ఒకవేళ కేసీఆర్ భాజపాతో దోస్తీ మరింత బలపరుచుకోదలిస్తే, ఈ ఏడాది నుంచి తెలంగాణా విమోచన దినోత్సవం నిర్వహించినా ఆశ్చర్యం లేదు. కనుక ఇప్పుడు ఆలోచించుకోవలసింది మజ్లీస్ పార్టీయే. బహుశః వచ్చే ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరుతుందేమో?