భాగ్యనగరంలో అభాగ్యులు వాళ్ళు

January 05, 2017


img

“నల్లనివన్నీ నీళ్ళు కావు తెల్లనివన్నీ పాలూ కావు...దూరపు కొండలు నునుపు...” గత వారం రోజులుగా ఇందిరా పార్క్ వద్ద సాగుతున్న ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్ల ధర్నాలు, నిరాహార దీక్షలు చూస్తున్న వారెవరికైనా ఇటువంటి సామెతలన్నీ గుర్తుకు వస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, వాళ్ళు దర్జాగా ఏసీ కారు నడుపుకొంటూ కావలసినంత సంపాదించుకొంటున్నారని అందరూ భావిస్తుంటారు. హైదరాబాద్ వంటి మహానగరంలో నానాటికీ క్యాబ్ కల్చర్ పెరిగిపోవడంతో ఎక్కడ చూసినా క్యాబ్ లే కనిపిస్తుండటంతో ప్రజలకి అటువంటి అభిప్రాయం కలగడం సహజం. కానీ వాళ్ళు రోడ్డున పడినప్పుడు గానీ వారి దయనీయమైన పరిస్థితుల గురించి ప్రజలకి తెలియలేదు. 

ఆ రెండు సంస్థలతో కాంట్రాక్టు కుదుర్చుకొన్న నిరుద్యోగ యువకులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాహనాలను కొనుకొంటారు. అగ్రిమెంటు ప్రకారం ఆ రెండు సంస్థలు వారికి చెల్లింపులు చేస్తూనే ఉన్నాయి. కానీ వారి రోజువారి ఆదాయం వారి క్యాబ్ బుకింగ్స్ పై ఆధారపడి ఉంటుంది. మొదట్లో రాబడి బాగానే ఉన్నప్పటికీ, ప్రజలకు ఇంకా వేగంగా సేవలు అందించడం కోసం ఆ రెండు సంస్థలు తమ క్యాబ్స్ సంఖ్యని పెంచుకొంటూపోతున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడినట్లు క్యాబ్ ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ క్యాబ్ ఓనర్లు (డ్రైవర్ల) ఆదాయం కూడా తగ్గిపోతోంది. 

ఇక ఈ రకం సేవలు అందిస్తున్న సంస్థల మద్య పోటీ పెరగడంతో అవి కొత్త కొత్త ఆలోచనలను అమలుచేయడం మొదలుపెట్టాయి. వాటిలో క్యాబ్ షేరింగ్, బైక్ టాక్సీ సర్వీసులు కూడా ఉన్నాయి. వాటి వలన ప్రజలకు తక్కువ ఛార్జీలతో ప్రయాణం చేయగలరేమో కానీ క్యాబ్ ఓనర్ల ఆదాయం ఇంకా పడిపోసాగింది. వారాంతపు శలవులు, పండుగ రోజులు వచ్చినప్పుడు అసలే గిరాకీ ఉండదని క్యాబ్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆదాయం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు రోజువారి లేదా నెలసరి వాయిదాలు తప్పనిసరిగా చెల్లించవలసిందే. వాయిదాలు కూడా చెల్లించలేకపోతే ఏజంట్ల వేధింపులు తప్పవు. అవి భరించలేక నిన్ననే ఒక క్యాబ్ ఓనర్ తండ్రి గుండెపోటుతో చనిపోయారు. ఇవీ క్యాబ్ ఓనర్ల కష్టాలు.

వారు క్యాబ్ ఓనర్లే కానీ వారి బ్రతుకులు డ్రైవర్ల కంటే హీనంగా తయారయింది. వారు తమ స్వంత వాహనాలనే నడుపుతున్నప్పటికీ తమను తాము డ్రైవర్లుగానే భావించుకొంటున్నారంటేనే వారి దయనీయపరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. వారి గోడును ఆ రెండు సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో సహనం నశించి రోడ్డెక్కక తప్పలేదు. డిశంబర్ 31 నుంచి ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా ఆ రెండు సంస్థల యాజమాన్యాలు ఇంతవరకు వారితో చర్చలకు ఇష్టపడలేదు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి చొరవ చూపలేదు. కనుక తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. 

అన్ని లక్షలు పెట్టి కార్లు కొనుకొన్నప్పటికీ వాటికే వారే డ్రైవర్లుగా మారిపోయారు. అయినా కూడా ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ కి ఉండే గౌరవం, స్వేచ్చా, స్వాతంత్ర్యం, ఆదాయం కూడా లేవు. వారు భాగ్యనగరంలో అభాగ్యులు అని చెప్పక తప్పదు. 

ఆరెండు సంస్థల యాజమాన్యాలు స్పందించడం లేదు. ఉద్యోగాల కల్పనకి చాలా ప్రాధాన్యత ఇస్తున్న తెరాస సర్కార్ కాస్త చొరవ తీసుకొని మధ్యవర్తిత్వం చేసి వారి సమస్యలను పరిష్కరిస్తే, క్యాబ్ ఓనర్ల ఈ ఉపాధి మార్గం దెబ్బ తినకుండా కాపాడినట్లవుతుంది. వారు, వారిపై ఆధారపడిన వారి కుటుంబాలు రోడ్డునపడకుండా కాపాడినట్లవుతుంది.


Related Post