ఒకప్పుడు సినిమావాళ్ళు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు వేర్వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులైపోతున్నారు. అలాగే రాజకీయ నాయకులు సినిమాలు తీస్తున్నారు, పరిశ్రమలు, కాంట్రాక్టులు, విద్యాసంస్థలతో సైడ్ బిజినెస్ చేసుకొంటున్నారు. కనుక ఎవరు ఏ రంగంలో కన్పించినా ఆశ్చర్యపోనక్కరలేదు.
మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని వరుసగా అనేక సినిమాలు చేస్తున్న నటి హేమకు రాజకీయ దురద మొదలవడంతో గత ఎన్నికల సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి ఆ దురద తీర్చుకొన్నారు. కానీ అది ఇంకా పూర్తిగా తీరినట్లు లేదు అందుకే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం వెనుక తిరుగుతున్నారు. ఆయనకు ఉడతా భక్తిగా సాయం అందించేందుకే వస్తున్నానని దాని వలన తన సినీ కెరీర్ కు ఏమీ కాదని సమర్ధించుకొన్నారు.
ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ పీక్ లో ఉందని చెప్పవచ్చు. మంచి అవకాశాలు వచ్చిపడుతున్నప్పుడు వాటిని అందిపుచ్చుకొని ఇంకా రాణించే ప్రయత్నం చేయకుండా మద్యలో కొరివితో తల గోక్కొన్నట్లు ఈ ఉద్యమాల జోలికి ఎందుకు వెళుతున్నారో అర్ధం కాదు.
కాపులకు రిజర్వేషన్లు కోసం పోరాడుతున్నాని చెప్పుకొంటున్న ముద్రగడ పద్మనాభానికే తన ఉద్యమం మీద చిత్తశుద్ధి లేదు. అయన జగన్మోహన్ రెడ్డి తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేస్తున్నారని కళ్ళకు కనబడుతూనే ఉంది. వచ్చే ఎన్నికలలో కాపుల ఓట్లను తెదేపాకు పడకుండా అడ్డుకొని వాటిని వైకాపా ఖాతాలో జమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన వైకాపా నేతలతో రాసుకుపూసుకు తిరగడం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.
ఆయనే ఏదో రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్న ఆ ఉద్యమం లోతుపాతుల గురించి తెలియని హేమ వంటివారు మద్యలో దూరితే ఆంబోతుల పోరులో లేగదూడలాగ నలిగిపోయే ప్రమాదం ఉంటుంది. పైగా ప్రజలందరూ ఆమెలో తమ ఇంటి ఆడపడుచును చూసుకొంటున్నప్పుడు, “నేను కేవలం కాపు జాతికి మాత్రమే చెందినదానినని స్వయంగా చాటింపు వేసుకొని అందరినీ దూరం చేసుకొన్నట్లవుతుందని గ్రహిస్తే మంచిది.
ఒకప్పుడు అందరివాడుగా ప్రజల ఆదరాభిమానాలు పొందిన చిరంజీవి, రాజకీయాలలోకి ప్రవేశించిన తరువాత ఒక ప్రాంతం, మళ్ళీ అందులో ఒక కులానికే చెందినవాడుగా ముద్ర వేసుకొని కొందరివాడుగా మారిపోయినట్లే, హేమకి కూడా మున్ముందు అదే పరిస్థితి రావచ్చునని గ్రహిస్తే మంచిది.