దావూద్ ఆస్తుల జప్తు...మా ఘనతే!

January 05, 2017


img

ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు దుబాయ్ లో ఉన్న రూ.15,000 కోట్లు విలువ గల ఆస్తులను యూఏఈ ప్రభుత్వం జప్తు చేసిందని భాజపా ట్వీట్ ద్వారా తెలియజేసింది. రెండేళ్ళ క్రితం ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్ వెళ్ళినప్పుడు దావూద్ ఇబ్రహీం పాల్పడిన నేరాలు, దుబాయ్ లో అతనికి గల ఆస్తుల వివరాలను యూఏఈ ప్రభుత్వానికి అందజేసి అతనిపై చర్యలు తీసుకోవలసిందిగా అభ్యర్ధించారని, దానిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ ప్రభుత్వం దర్యాప్తు చేసి దావూద్ ఆస్తులను జప్తు చేసిందని భాజపా తెలియజేసింది. 

దావూద్ వంటి కరడుగట్టిన నేరగాడి ఆస్తులను జప్తు చేసి యూఏఈ ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకొందని చెప్పవచ్చు. కానీ నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగిన కేంద్రప్రభుత్వం, దేశంలో నల్లధనం పోగేసుకొన్న కార్పోరేట్ సంస్థలు, రాజకీయ నేతలు, సినీ, క్రీడా రంగాలకు చెందిన వారి జోలికి వెళ్ళే సాహసం చేయలేకపోయింది. దేశంలో నల్లధనం ఎక్కడ పోగుపడి ఉందో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకి, ఆదాయపన్ను, ఈడి, నిఘా సంస్థ అధికారులకి అందరికీ చాలా ఖచ్చితంగా తెలుసు. కానీ వారెవరి జోలికి వెళ్ళే సాహసం చేయలేకపోయారు. అందుకే కేంద్రప్రభుత్వం ఆశించిన స్థాయిలో నల్లధనం వెలికి తీయలేకపోయింది. 

దావూద్ ఇబ్రహీం ఒక కరడు గట్టిన నేరగాడని తెలుసు. కానీ ఐటి శాఖ దాడులలో శేఖర్ రెడ్డి వంటివారు దొరికితే దొంగలు లేకుంటే తిరునామాలు పెట్టుకొని అటు ప్రజలకు, ప్రభుత్వానికి కూడా నామాలు పెడుతుంటారు. అతను, అతని భాగస్వాముల వద్ద నుంచే సుమారు 170 కోట్లు నల్లధనం, 127 కేజీల బంగారం పట్టుబడింది. దేశంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న అటువంటి దోపీడీ దొంగలు లెక్కలేనంత మంది ఉన్నారు కానీ ఏ ప్రభుత్వమూ వారి జోలికి వెళ్ళే సాహసం చేయదు. చేయలేదు.

ఒక్క వ్యక్తి దగ్గరే అంత బారీ సొమ్ము, బంగారం పట్టుబడితే, ఇక అతనికి వంద, వేల రెట్లు ఆదాయం సంపాదిస్తున్నవారిని పట్టుకొంటే ఇంకెంత బయటపడుతుందో ఎవరూ ఊహించలేరు కూడా. కేంద్ర ప్రభుత్వం ఆ పని చేసి చూపి ఉండి ఉంటే ప్రజలే దానిని నెత్తిన పెట్టుకొని ఉండేవారు కదా!  


Related Post