సరిపడినంత నగదు ఇవ్వకపోయినా...

January 04, 2017


img

డిశంబర్ 30వ తేదీ వరకు బ్యాంకులు, ఎటిఎంల ద్వారా ప్రజలకు అందిస్తానన్న మొత్తాన్ని అందించడంలో కేంద్రప్రభుత్వం విఫలమవడం అందరూ చూశారు. నేటికీ దేశంలో అనేక ఎటిఎంలు మూతపడే ఉన్నాయి. అవి ఎప్పుడు తెరుచుకొంటాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. తెరిచి ఉన్న ఎటిఎంలలో నగదు వెంట వెంటనే ఖాళీ అయిపోతుండటంతో ప్రజలు ఇతర ఎటిఎంలలో నగదు విత్ డ్రా చేయవలసి వస్తోంది. 

నగదు విత్ డ్రాలపై రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలను డిశంబర్ 30వ తేదీ తరువాత పూర్తిగా తొలగిస్తుందని ఎవరూ అత్యాశ పడలేదు. ప్రజలు ఊహించినట్లుగానే నగదు విత్ డ్రా పరిమితిని రూ.4,500 కి పెంచింది. ఆ మాత్రానికే అల్పసంతోషులైన ప్రజలు చాలా సంతోషపడ్డారు. అయితే నగదు విత్ డ్రాలపై ఆంక్షలను పూర్తిగా తొలగించనప్పటికీ, స్వంత బ్యాంక్ ఎటిఎంల నుంచి నెలకు 5సార్లు, ఇతర బ్యాంక్ ఎటిఎంల నుంచి 3 సార్లు మాతమే నగదు విత్ డ్రా నిబందనలని మళ్ళీ అన్ని బ్యాంకులు అమలుచేయడం మొదలుపెట్టాయి. 

ప్రజలు తమ నిత్యావసరాలకు సరిపడినంత నగదు తీసుకోవాలంటే రోజుకి రూ.4,500 చొప్పున ఎటిఎంల నుంచి నెలలో ఐదారుసార్లు కంటే ఎక్కువసార్లు తీసుకొన్నట్లయితే, ఆరవసారి నుంచి ఎటిఎం చార్జీల బాదుడు మొదలవుతుంది. ఎటిఎంలలో నగదు లేదని వేరే బ్యాంక్ ఎటిఎంల నుంచి నగదు విత్ డ్రా చేసినట్లయితే ఆ బాదుడు ఇంకా పెరిగిపోతుంది. ఇక డిశంబర్ 30 వరకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసిన లావాదేవీలపై సర్వీస్ చార్జ్ మినహాయించారు. కానీ జనవరి 1 నుంచి యధాప్రకారం మళ్ళీ సర్వీస్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.

ఇన్నాళ్లుగా దేశం కోసం తన ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చెపుతున్నారు. నేటికీ ప్రజలు ఇంకా ఓర్చుకొంటూ సహకరిస్తూనే ఉన్నారు. ప్రజల అవసరాలకు తగినంత నగదు అందించలేకపోతున్న కేంద్రప్రభుత్వం ఇటువంటి ఆంక్షలు విదించి మళ్ళీ యధాప్రకారం చార్జీలు వసూలు చేయడం సరికాదు. అలాగే ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలు జరుపాలని పదేపదే చెపుతున్నప్పుడు మళ్ళీ ఈ చార్జీలను వసూలు చేయడం వలన ప్రజలను నిరుత్సాహపరుస్తునట్లుంది. కనుక నగదు ఉపసంహరణలపై రిజర్వ్ బ్యాంక్ విదించిన ఆంక్షలను పూర్తిగా తొలగించే వరకు ఎటిఎంల నుంచి నెలకి 5 విత్ డ్రాలు, డెబిట్ కార్డులపై సర్వీస్ చార్జీలను మినహాయింపు ఇవ్వడం మంచిది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనుకొంటే సర్వీస్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడం మంచిది. 

రెండు నెలలుగా కేంద్రప్రభుత్వానికి సహకరిస్తున్న ప్రజలకు బహుమానాలు ఇవ్వనవసరం లేదు. ఎటువంటి అదనపు వడ్డింపులు లేకుండా వారి డబ్బుని వారు తీసుకొనేందుకు అనుమతిస్తే చాలు.


Related Post