ఉట్టికి ఎగురలేని కేజ్రివాల్...

January 03, 2017


img

ఉట్టి అందుకోలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం. ఆయన రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు ఏదో గొప్ప మార్పులు సాధించి చూపిస్తారని అందరూ ఆశిస్తే అయన కూడా సగటు రాజకీయ నేతలాగే వ్యవహరిస్తున్నారు. డిల్లీ ప్రజలు ఆయనపై చాలా ఆశలుపెట్టుకొని తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రిని చేస్తే, ముందుగా వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాపును చూసి బలుపు అనుకొంటూ 2014 సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీని దేశమంతటా విస్తరించాలని ప్రయత్నించి భంగపడ్డారు. కనీసం అప్పటికైనా ఆయనకి జ్ఞానోదయం కాకపోవడం విచిత్రం. 

డిల్లీ ప్రజలు సంతృప్తి చెందేలాగ పరిపాలన సాగించి మంచిపేరు తెచ్చుకొనే ప్రయత్నం చేయకుండా ఎల్లప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ తను కూడా ఆ స్థాయి నేతనని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. త్వరలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక వాటిలో పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాలకి తన ఆమాద్మీని విస్తరించాలని కలలు కంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నేడు గోవాలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించి అనేక హామీలు గుప్పించారు.  

డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేళ్ళు పూర్తి కావస్తోంది. కానీ ఈ రెండేళ్ళలో అరవింద్ కేజ్రీవాల్ అనేక వివాదాలు, కోర్టు కేసులు, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో తలదూర్చడం, గత ఆరేడు నెలలుగా పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాల ఎన్నికలకు సన్నాహాలలో తీరిక లేకుండా ఉన్నారు. డిల్లీని పాలించమని ఆయనకి ప్రజలు అధికారం కట్టబెడితే ఆ ఒక్క పనీ తప్ప మిగిలినవన్నీ చేస్తున్నారు. డిల్లీ ప్రజలే ఆయన పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు, ఇక తనకు బొత్తిగా పట్టులేని ఇతర రాష్ట్రాలలో ఏమి చేయగలరు? మిగిలిన మూడేళ్ళు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇదే విధంగా వ్యవహరించినట్లయితే ఈసారి డిల్లీ ప్రజలు కూడా ఆయనను తిరస్కరించవచ్చు. 


Related Post