తమిళనాడు అధికార పార్టీ అన్నాడిఎంకె పార్టీలో రేపే ఫైనల్స్ జరుగబోతున్నాయి. అంటే ఆ పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే విషయం రేపే తేలిపోనుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడానికి ఆ పార్టీ కౌన్సిల్ సభ్యులు గురువారం చెన్నైలో సమావేశం కానున్నారు. ఆ సమావేశం దాని కొరకేనని ఆ పార్టీ ప్రతినిధి పొన్నియన్ చెప్పారు.
ఇక రేపు జరుగబోయే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీ నుంచి బహిష్కరించబడిన శశికళ పుష్ప తరపున ఆమె భర్త, వారి లాయర్ ఈరోజు పార్టీ కార్యాలయానికి రాగా వారిపై శశికళ నటరాజన్ వర్గం దాడి చేసి తరిమికొట్టింది. కానీ అటువంటిదేమీ జరుగలేదని, పార్టీ నుంచి బహిష్కరింపబడిన శశికళ పుష్ప వర్గం బలవంతంగా పార్టీ కార్యాలయంలో ప్రవేశించబోతే కొందరు పార్టీ నేతలు అడ్డుకొన్నారని పోన్నియన్ చెప్పారు. ఇక జయలలిత మేనకోడలు రూప జయరామన్ కూడా అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు చెప్పట్టాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జయలలిత స్నేహితురాలు శశికళ నటరాజన్ పార్టీ పగ్గాలు చేప్పట్టాడానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మొదట అంగీకరించినప్పటికీ, ఆమె తన ముఖ్యమంత్రి పీఠంపై కూడా కన్ను వేయడంతో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టకుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. రేపు జరుగబోయే రాజకీయ పరిణామాలు అన్నాడిఎంకె పార్టీ భవిష్యత్, ఇద్దరు శశికళలు, రూప జయరామన్, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో స్పష్టత కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ శశికళ నటరాజన్ పార్టీ పగ్గాలు చేపట్టినట్లయితే ఆమె పన్నీర్ సెల్వం పదవికి ఎసరు పెట్టేసినట్లే భావించవచ్చు. ఇది చాలా కీలకమైన రాజకీయ పరిణామం కనుక ఆ సమావేశంలో వారి వర్గాల మద్య తీవ్ర ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉండవచ్చు.