మసరత్ ఆలం అనే కరుడుగట్టిన వేర్పాటువాదిని తక్షణం జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశిస్తూ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బుదవారం తీర్పు ఇచ్చింది. అతను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదాన్ని గట్టిగా ప్రోత్సహిస్తున్న హురియత్ కాన్ఫరెన్స్ అధినేత సయ్యద్ అలీ షా గిలానితో బలమైన సంబంధాలున్నాయి. 2010 లో కాశ్మీర్ లో జరిగిన అల్లర్లలో 120 మందికి పైగా చనిపోయారు. ఆ అల్లర్లకు మసరత్ ఆలం బాధ్యుడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. కానీ వేర్పాటువాదులకు మద్దతు పలికే మాజీ ముఫ్తీ మహమ్మద్ సయీద్ 2015లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అతనిని విడుదల చేశారు. కానీ కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు మళ్ళీ అరెస్ట్ చేయవలసి వచ్చింది. ఆయన మరణించిన తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మహబూబా ముఫ్తీ తన తండ్రి అడుగు జాడలలోనే నడుస్తానని ముందే ప్రకటించారు. చెప్పినట్లుగానే అధికారం చేపట్టిన ఆరు నెలలోనే మసరత్ ఆలం విడుదలకు మార్గం సుగమం చేశారు.
ముఫ్తీ సర్కార్ మొదటి నుంచి వేర్పాటువాదులకు అనుకూలంగానే ఉందని, అందుకే కోర్టులో పేలవమైన వాదనలు వినిపించి అతని విడుదలకు సహకరించిందని, ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన విడుదలే తప్ప యాద్రుచ్చికంగానో లేదా పొరపాటునో జరిగినది కాదని సమాచార హక్కుల కోసం పోరాడే ఒక స్థానికుడు చెప్పారు. గతంలో కూడా మసరత్ ఆలంని చాల సార్లు అరెస్ట్ చేయబడ్డాడని కానీ ప్రతీసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇదేవిధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మనుగడ సాగించాలన్నా, శాంతియుత వాతావరణం నెలకొని ఉండాలన్నా వేర్పాటువాదుల మద్దతు, సహాకారం చాలా అవసరమని అక్కడి రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నందునే ఈవిదంగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చు. ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తరువాత కాశ్మీర్ లో సుమారు మూడున్నర నెలల పాటు అల్లర్లు జరిగాయి. మళ్ళీ అటువంటి అల్లర్లని ప్రోత్సహించిన మసరత్ ఆలంని మహబూబా ముఫ్తీ ప్రభుత్వం జైలు నుంచి విడిపించి బయటకి రప్పించింది. ఇక ముందు ఏమవుతుందో ఏమో ఎవరూ ఊహించలేరు.