తమిళనాడులో తెర వెనుక చాలా జోరుగా రాజకీయాలు చూస్తుంటే అక్కడ ఏదో చాలా పెద్ద రాజకీయ మార్పులే జరుగబోతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రముఖ తమిళ నటుడు అజిత్ పోయెస్ గార్డెన్ కి వెళ్ళి శశికళతో మంతనాలు చేయగా, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం రజనీ కాంత్ ఇంటికి వెళ్ళి మంతనాలు సాగించడం విశేషం. ఒకప్పుడు అజిత్ ని జయలలిత వారసుడుగా అనుకొన్నారు. కనుక పన్నీర్ సెల్వంని ఆ కుర్చీలో దించేసి తను కూర్చోవాలని తహతహలాడుతున్న శశికళ అది సాధ్యం కాదని గ్రహించి, తమిళనాడులో మంచి ప్రజాధారణగల పెద్ద సినీ హీరో అయిన అజిత్ ని ఆ కుర్చీలో కూర్చోబెట్టి తను రిమోట్ పద్దతిలో రాష్ట్రాన్ని పాలించాలని ఆలోచిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.
ఇక రజనీకాంత్ చాల దశాబ్దాలుగా రాజకీయాలలోకి వస్తానని చెప్పుతూ ఊరిస్తున్నారే కానీ రావడం లేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ ఇన్నాళ్ళు జయలలిత, కరుణానిధిలను తట్టుకొని నిలబడలేక రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. ఈ నేపధ్యంలో చిదంబరం వెళ్ళి రజనీకాంత్ ని కలవడం యాదృచ్చికమని అనుకోలేము.
ఇక ఇటీవల ఐటి అధికారుల దాడులను ఎదుర్కొన్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావు మీడియాతో మాట్లాడుతూ “నాకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించడం చాలా ఆలోచన కలిగిస్తుంది. ఆయన ఒక ప్రభుత్వాధికారిగా పని చేసినప్పుడు అన్నాడిఎంకె పార్టీ గురించి ఎందుకు మాట్లాడారు? ఆయన ప్రశ్న వింటే ఆయన కూడా అన్నాడిఎంకె పార్టీలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకి శశికళ వర్గాలకి మద్య ప్రస్తుతం జరుగుతున్న ఆధిపత్యపోరులో తెర వెనుక చక్రం తిప్పుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె పార్టీ నేత స్టాలిన్ కూడా పన్నీర్ సెల్వంకి శశికళ వర్గాలకి మద్య జరుగుతున్న ఆధిపత్యపోరుపై గవర్నర్ లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. వాటి ప్రభావంతో కూడా అనేక రాజకీయ పరిణామాలు జరుగుతుండటం విశేషం. ఉదాహరణకి రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల వైస్-ఛాన్సిలర్లు ఎ పదవి, అధికారం లేని శశికళతో ఎందుకు సమావేశమయ్యారు? వారిపై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ స్టాలిన్ వ్రాసిన లేఖపై గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తక్షణమే స్పందిస్తూ వారందరికీ నోటీసులు పంపించారు.
కనుక తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న అయోమయ రాజకీయ పరిస్థితులని తమకి అనుకూలంగా మలుచుకోవడానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలే కాకుండా కాంగ్రెస్, భాజపా, డిఎంకె పార్టీలు కూడా తెర వెనుక పావులు కదుపుతున్నట్లు అనుమానం కలుగుతోంది. జయలలిత మరణించినప్పుడు రెండు మూడు నెలల తరువాత రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకుల ఊహించారు. కానీ ఆలోగానే రాష్ట్ర రాజకీయాలపై, ప్రభుత్వంపై ఎవరు ఆదిపత్యం దక్కించుకోబోతున్నారనే విషయంపై పూర్తి స్పష్టత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.