సుమారు ఐదారు నెలల క్రితం రాష్ట్రంలో న్యాయవాదులు, జడ్జీలు ప్రాధమిక నియామకాల తీరుని నిరసిస్తూ ఉద్యమించారు. దానితో బాటే ఉమ్మడి హైకోర్టుని విభజించి రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లెక్కారు. వారి ఉద్యమానికి కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా దిగిరాక తప్పలేదు. తనపై గౌరవం ఉంచి న్యాయవాదులు ఉద్యమం విరమించినట్లయితే వీలైనంత త్వరగా హైకోర్టు విభజన జరిపిస్తానని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. ఆయన మాటని మన్నించి న్యాయవాదులు తమ ఉద్యమం విరమించి విధులలో చేరారు. ఇదంతా జరిగి ఇప్పటికి 5 నెలలు అయ్యింది కానీ ఇంతవరకు హైకోర్టు విభజనకి ఎటువంటి ప్రయత్నమూ జరుగుతున్నట్లు కనబడటం లేదు. అసలు హైకోర్టు విభజన గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటమే లేదు కూడా. అంటే ఆరోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ ఇచ్చిన మాటకి కూడా విలువ లేదా?అనే సందేహం కలుగుతుంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 30 నెలలు పూర్తయ్యాయి. కానీ ఇంతవరకు రాష్ట్రానికి వేరేగా హైకోర్టు లేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తొందర లేదు కనుక అది సహకరించడం లేదనుకోవచ్చు. కానీ తెరాస సర్కార్ దాని కోసం కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? అలాగే కేంద్రప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గట్టిగా ఎందుకు చెప్పడం లేదు? అసలు హైకోర్టు విభజన కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి?ఎప్పటిలోగా హైకోర్టు ఏర్పాటు అవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు కోసం శాశ్విత భవనాలు నిర్మించుకోనేవరకు ఉమ్మడి హైకోర్టుతోనే సర్దుకుపోక తప్పదా? ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యపూర్వకంగానే అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టడం ఆలస్యం చేస్తే, అప్పుడు తెరాస సర్కార్ ఏమి చేయాలనుకొంటోంది? అని సామాన్య ప్రజలకి కలుగుతున్న సందేహాలు.