ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు దేశప్రజలు దానిని స్వాగతించగా, ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. కానీ నగదు కొరత కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో వారు కూడా కేంద్రప్రభుత్వంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మార్కెట్లో నుంచి ఉపసంహరించినంత నగదును మళ్ళీ వెంటనే ప్రవేశపెట్టలేకపోవడం వలననే సమస్యలు ఎదురవుతున్నాయని స్పష్టం అయ్యింది. దేశంలో జనాభా అధికంగా ఉండే ప్రధాన నగరాలలో నేటికీ నగదు కొరత చాలా తీవ్రంగానే ఉంది. మార్కెట్లో నుంచి ఉపసంహరించినంత నగదుకు సమానమైన నగదును మళ్ళీ భర్తీ చేసే వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుంది.
ఈనెల 30వ తేదీతో బ్యాంకులు, ఎటిఎంలలో నుంచి నగదు విత్ డ్రాలపై ఉన్న నిబందన తొలగించవలసి ఉంటుంది. అందుకు కేంద్రప్రభుత్వం కూడా సిద్దంగానే ఉంది కానీ బ్యాంకులలో సరిపడినంత నగదు లేని కారణంగా మరొక 4 నెలల పాటు నగదు విత్ డ్రాలపై ఉన్న పరిమితులను కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఎటిఎంల నుంచి రోజుకి రూ.15,000, బ్యాంకుల నుంచి రూ.50,000 మాత్రమే తీసుకొనేందుకు అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు మించి కూడా విత్ డ్రా చేయవచ్చు కానీ దానిపై 0.5-2 శాతం వరకు సర్ చార్జీని విదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం చేపట్టవలసిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నియమించిన జస్టిస్ ఎం.బి.షా కమిటీ ఈ సిఫార్సులను చేసినట్లు సమాచారం. తద్వారా దేశ ప్రజలను నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ప్రోత్సహించవచ్చని ఆ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
దేశహితం కోసం కేంద్రప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయాలే తీసుకొంటున్నప్పటికీ, వాటి వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలు, బంగారంపై ఆంక్షలు, ఇప్పుడు నగదు విత్ డ్రాలపై పరిమితులు, సర్ చార్జీలు వంటి ఈ నిర్ణయాలన్నీ సామాన్య ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించేవే. దేశంలో నిరుపేదలు, నిరక్షరాస్యులు, సామాన్య ప్రజల పరిస్థితులు అర్ధం చేసుకోకుండా నగదు రహిత లావాదేవీలను అమలుచేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి.
కేంద్రప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల ఫలాలు దేశంలో నిరుపేదలు, సామాన్య ప్రజలకి అందుతుంటే వారు కూడా ప్రభుత్వానికి మద్దతు పలుకుతారు. కానీ ఫలాలు అన్నీ ఉన్నతవర్గాలకి, సమస్యలు, సవాళ్ళు, శిక్షలు అన్నీ సామాన్య ప్రజలకి పంచుతుండటంతో వారు తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి గురవుతున్నారు.
ఈ సంగతి కేంద్రప్రభుత్వం గ్రహించినట్లు లేదు కానీ ప్రతిపక్షాలు గ్రహించబట్టే నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంత గట్టిగా పోరాడాయి. కనుక కేంద్రప్రభుత్వం ఈవిధంగా సామాన్య ప్రజలపై ఎంత ఒత్తిడి తెస్తే అంతగా అదే మూల్యం చెల్లించవలసి రావచ్చు. ఆ ప్రయోజనం ప్రతిపక్షాలకు దక్కవచ్చు. ఈ చర్యలన్నిటిపై వచ్చే ఏడాది జరుగబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ప్రజలు తీర్పు చెప్పడం ఖాయం. అది తమకు అనుకూలంగా ఉండలనుకొంటే కేంద్రప్రభుత్వం సామాన్య ప్రజల సహనాన్ని ఇంకా పరీక్షించడం మానుకోవలసి ఉంటుంది. లేకుంటే కూర్చొన్న కొమ్మనే నరుకొంటున్నట్లవుతుంది.