కేంద్రప్రభుత్వంపై అన్నాడిఎంకె తీవ్ర ఆరోపణలు

December 21, 2016


img

తమిళనాడులో జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు ఊహించినట్లుగానే అధికార అన్నాడిఎంకె పార్టీలో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వాటిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి దీరన్ మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాయే రాజకీయ దురుదేశ్యంతోనే ఐటి, సిబిఐ శాఖలను ఉసిగొల్పి దాడులు చేయిస్తూ మా పార్టీ నేతలను భయాందోళనలకు గురిచేసి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇటువంటి బెదిరింపు రాజకీయాలకి మేము భయపడబోము. కేంద్రప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేము కూడా చట్ట ప్రకారమే కేంద్రప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము,” అని చెప్పారు. 

నల్లకుభేరుల మీద ఆదాయపన్ను శాఖా అధికారులు దాడులు చేస్తుంటే అన్నాడిఎంకె పార్టీ వాటిని తమపై జరుగుతున్న దాడులుగానే పరిగణించడం విచిత్రమనుకొంటే, అది చేసిన ఈ ఆరోపణలపై కేంద్రప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం మరో విశేషం. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పొన రాధాకృష్ణన్ ఆ ఆరోపణలను ఖండించారు. తమిళనాడులో జరుగుతున్న ఐటి దాడులతో కేంద్రప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని, ఐటి శాఖ తనకు అందిన సమాచారం మేరకే దాడులు నిర్వహిస్తుంటుందని వారు చెప్పారు. 

ఈ రెండు పార్టీల వాదనలు విన్నట్లయితే ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఐటి దాడులు కేవలం నల్లధనం వెలికి తీయడానికి మాత్రమే ఉద్దేశ్యించినవి కావని అర్ధం అవుతోంది. అయితే అన్నాడిఎంకె పార్టీలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలలో ఎవరి తరపున ధీరన్ ఆ ఆరోపణలు చేశారో తెలిస్తే మిగిలిన కధని చెప్పవచ్చు. శేఖర్ రెడ్డిపై సిబిఐని ప్రయోగించడం ద్వారా ఆ కేసును కేంద్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొన్నట్లయింది. కనుక కేంద్రప్రభుత్వం శేఖర్ రెడ్డి అనే తీగ లాగి అన్నాడిఎంకె అనే డొంకని కదపడం ఇప్పుడు చాలా తేలిక. 



Related Post