హమ్మయ్య! భూకంపం వచ్చేసింది

December 21, 2016


img

భూకంపం వస్తే హమ్మయ్య! అని సంతోషించడం ఏమిటి? అని ఆశ్చర్యపోవద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన భూకంపం. తను మాట్లాడితే భూకంపం వచ్చేస్తుందని పదేపదే హెచ్చరించినా ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోకపోవడంతో, ఆ రహస్యాన్ని ఈరోజు బయటపెట్టేశారు. భూకంప కేంద్రం గుజరాత్ లోనే ఉంది కనుక ఆయన అక్కడికే వెళ్ళి మెహసన అనే ప్రాంతంలో తనకు మోడీ గురించి తెలిసిన ఆ రహస్యాన్ని బయటపెట్టేశారు. 

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు అక్టోబర్ 2013-ఫిబ్రవరి 2014 మధ్యకాలంలో సహారా ఇండియా గ్రూప్ నుంచి రూ.40.1 కోట్లు తొమ్మిది వాయిదాలలో లంచంగా తీసుకొన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సహారా గ్రూప్ ఉద్యోగులలో దైరీలలో ఆ విషయం స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విషయం తెలుసుకొన్న ఆదాయపన్ను శాఖా అధికారులు నవంబర్ 22, 2014లో సహారా గ్రూప్ పై దాడులు నిర్వహించి ఆ డైరీలను స్వాధీనం చేసుకొన్నారు. అప్పటి నుంచి ఆ డబ్బు ఆదాయపన్ను శాఖ వద్దనే ఉందని చెప్పారు. మోడీ అవినీతికి పాల్పడ్డారనేందుకు అదే బలమైన నిదర్శనం కనుక స్వతంత్ర సంస్థ చేత దీనిపై విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 

సహారా గ్రూప్ నిజంగానే మోడీకి లంచం ఇచ్చి ఉండి ఉంటే దానిని ఆదాయపన్ను శాఖా అధికారులు మోడీ నుంచి స్వాధీనం చేసుకొని ఉండాలి. కానీ ఆదాయపన్ను శాఖా అధికారులు సహారా గ్రూప్ పై దాడులు చేశారని రాహుల్ గాంధీ చెపుతున్నారు. ఆదాయపన్ను శాఖా అధికారులు సహారా గ్రూప్ పై దాడులు చేస్తే, మోడీ దగ్గర ఉన్న ఆ డబ్బు  వారికి ఏవిధంగా చిక్కింది? ఒకవేళ సహారా గ్రూప్ వద్ద నుంచి ఆ డబ్బుని వారు స్వాధీనం చేసుకొని ఉండి ఉంటే మోడీకి దానితో ఏవిధంగా సంబంధం ఉంటుంది? ఇది జరిగి రెండేన్నరేళ్ళు గడిచిందని రాహుల్ గాంధీ స్వయంగా చెపుతున్నారు. మరి ఈవిషయం తెలిసినా ఆయన ఇంతకాలం దీనిని ఎందుకు బయటపెట్టలేదు? అనే ప్రశ్నలకు ముందు ఆయనే జవాబు చెప్పవలసి ఉంటుంది. 

ఒకవేళ మోడీ ఈ అవినీతికి పాల్పడటం నిజమే అనుకొన్నా అంతకంటే చాలా తీవ్రమైన గోద్రా (గుజరాత్) ఆరోపణలనే దేశ ప్రజలు పట్టించుకోలేదు. ఆయనను క్షమించేసి దేశ ప్రధానిగా ఎన్నుకొన్నారు. వాటి కారణంగా ఒకప్పుడు ఆయనని తమ దేశంలో అడుగు పెట్టడానికి అనుమతి నిరాకరించిన అమెరికా కూడా ఇప్పుడు ఆయనకు ఎర్రతివాచీ పరిచి ఘనస్వాగతం పలుకుతోంది. అమెరికన్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశ్యించి ఆయన ప్రసంగించారు కూడా. కనుక ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే ఈ రూ.40.1 కోట్లు అవినీతికి పాల్పడి ఉన్నా దేశప్రజలు ఎవరూ పట్టించుకోరని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక రాహుల్ గాంధీ చేసిన భూకంపం సూచన వచ్చే అవకాశం లేదనే చెప్పవచ్చు.

బహుశః రాహుల్ గాంధీకి భూకంపం సృష్టించడం ఎలాగో తెలియక తొందరపడినట్లున్నారు. అది ఏవిధంగా సృష్టించాలో తెలుసుకోవాలంటే మళ్ళీ నరేంద్ర మోడీనే అడగవలసి ఉంటుంది. ఈ ఏడాది సర్జికల్ స్ట్రయిక్స్ తో మొదటిసారి భూకంపం సృష్టించారు. మళ్ళీ నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటనతో మరొకసారి బారీ భూకంపం సృష్టించారు. రెండవసారి ఆయన సృష్టించిన భూకంప ప్రకంపనలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వ్యాపించింది. ఆ తాకిడికి దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయపార్టీలు అల్లాడిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక “హౌ టు క్రియేట్ యాన్ ఎర్త్ క్వేక్” అనే సబ్జెక్ట్ పై రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ సలహా తీసుకొంటే మంచిదేమో?


Related Post