అనంతపురం తెదేపా ఎంపి జెసి దివాకర్ రెడ్డి అంటే తెలియనివారుండరు. ఆయనేదో గొప్ప పనులు చేశారని కాదు కానీ మన సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ ఎలాగో రాజకీయాలలో జేసి అలాంటివారు కనుక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈరోజు ఆయన మంత్రి ఈటెల రాజేందర్, జానారెడ్డిలను శాసనసభ ఆవరణలో కలిసినప్పుడు వారితో ఆయన సరదాగా మాట్లాడుతూ “మా అనంతపురం, కర్నూలు రెండు జిల్లాలను కూడా తెలంగాణాలో కలిపేసుంటే బాగుండేది. ముఖ్యమంత్రులు అందరూ సీమ ప్రాంతానికి చెందినవారే అయినా ఏనాడూ సీమ జిల్లాలను పట్టించుకొన్నది లేదు. ముఖ్యంగా మా రెండు జిల్లాలు ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి మనుగడ సాగించవలసి ఉంటుంది. అదే వాటిని తెలంగాణా కలిపేసి ఉండి ఉంటే మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించేవాళ్ళం కదా? అని అన్నారు.
రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో సీమ జిల్లాలతో కలిపి రాయల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని జేసి వంటి సీమ జిల్లాల నేతలు కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు కూడా. తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఉంది కనుక ఆ ప్రతిపాదనను యూపియే ప్రభుత్వం కూడా పరిశీలించింది. ఆవిధంగా చేసినట్లయితే, వారి సహకారంతో తెలంగాణాలో తిరుగులేని అధికారం చలాయించ వచ్చునని భావించింది. ఆంధ్రా నుంచి సీమ జిల్లాలను వేరు చేయడం ద్వారా రెడ్డి సామాజిక వర్గంపైనే ఎక్కువ ఆధారపడున్న జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయవచ్చని ఆలోచించింది.
కానీ తెలంగాణా, రాయలసీమ ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అందుకే తెరాస ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడంతో యూపియే ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కనపడేసి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అయితే జేసి చెపుతున్నట్లుగా సీమ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా సీమని పట్టించుకోరనే మాట వాస్తవం. సీమలోని చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రబాబు నాయుడు దృష్టి ఎంతసేపు అమరావతి, కృష్ణా, గుంటూరు, విజయవాడ, విశాఖ ల మీదే ఉంటుంది తప్ప సీమ జిల్లాపై ఉండకపోవడం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. జేసిది గొంతెమ్మ కోరికే కానీ ఆయన కోరికలో ఆవేదన కూడా కనిపిస్తుంది.