సిద్దూ బఫూన్ గా మారినట్లున్నాడే?

December 21, 2016


img

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సహజంగానే చాలా కామెడీ చేస్తుంటాడు. క్రికెట్ వదిలి రాజకీయాలోకి వచ్చిన తరువాత తన కామెడీ షోని కొనసాగిస్తూనే ఉన్నాడు. పంజాబ్ ముఖ్యమంత్రి అయిపోదామనే తాపత్రయంతో భాజపాకి, తన ఎంపి పదవికి గుడ్ బై చెప్పేసి స్వంత కుంపటి పెట్టుకొన్నాక, కొన్ని రోజులకే అది రాజకీయ పార్టీ కాదని కూటమి అని ప్రకటించడంతో సిద్దూ తన కామెడీ షో మొదలుపెట్టాడు.

అంతకుకు ముందు తను హ్యండిచ్చి వచ్చిన ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోనే మళ్ళీ మంతనాలు మొదలుపెట్టాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో కూడా బేరసారాలు మొదలుపెట్టి, డీల్ సెటిల్ చేసుకొన్నాడు. అయినా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ముందుగా తన భార్యని ఆ పార్టీలో చేర్పించి ఇంకా ఆమాద్మీ పార్టీతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

అయితే చండీఘడ్, పంజాబ్ మున్సిపల్ ఎన్నికలలో అధికార భాజపా-అకాలీదళ్ కూటమి విజయకేతనం ఎగురవేయడంతో సిద్దూతో సహా కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు కూడా కంగు తిన్నాయి. ఆ ఫలితాలు వెలువడిన వెంటనే సిద్దూ పరుగున రాహుల్ గాంధీని కలిసి మళ్ళీ మంతనాలు చేశాడు. ఎందుకంటే, రెండు రోజుల క్రితం ఆ పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యేల అభ్యర్ధుల జాబితాలో సిద్దూ భార్య పేరు లేదు. కాంగ్రెస్ పార్టీ చేరుతానని చెప్పి సిద్దూ తమతో గేమ్స్ ఆడుతున్నందునే ఆమె పేరుని జాబితాలో చేర్చలేదని సమాచారం.

మొదట వారిద్దరికీ టికెట్స్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చి ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని తేల్చి చెప్పడంతో సిద్దూ పరిస్థితి అయోమయంగా మారింది. బహుశః మళ్ళీ భాజపాలోకి వెళ్ళిపోతాడో లేదా ఆరిపోతున్న తన అవాజ్-ఎ-పంజాబ్ కుంపటిని మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేస్తాడో చూడాలి. పంజాబ్ రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తాడనుకొన్న నవజ్యోత్ సింగ్ సిద్దూ ఒక పెద్ద బఫూన్ గా మారిపోయాడు.


Related Post