కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి నోటితో వినవలసిందే. “2+2 ఎంత అంటే 4 అని మాత్రమే తెలిసిన వ్యక్తి మన ఆర్దికమంత్రి. ఆ పదవికి ఆయన ఏమాత్రం పనికిరాడు. ఇంత పెద్ద నిర్ణయం(నోట్ల రద్దు) తీసుకొంటున్నప్పుడు ముందుగా ఏమి చేయాలో కూడా అయనకి తెలియదు,” అని సుబ్రహ్మణ్య స్వామి బహిరంగగానే విమర్శలు గుప్పిస్తుంటారు.
దేశ ఆర్ధిక వ్యవస్థని నియంత్రించిన ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ రఘురామ రాజన్ పై కూడా సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఇలాగే చాలా అనుచితంగా విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఏకంగా ఆర్ధిక మంత్రి మీదే చేస్తున్నారు. కానీ ఆయన విమర్శలను జైట్లీ కానీ ప్రధాని నరేంద్ర మోడీగానీ పట్టించుకోకపోవడమే వింత. అయితే అరుణ్ జైట్లీ నగదు రహిత లావాదేవీల గురించి ఈరోజు మాట్లాడింది విన్నట్లయితే ఆయన గురించి సుబ్రహ్మణ్య స్వామి వెలిబుచ్చిన అభిప్రాయలు సరైనవేనేమో అనే సందేహం కలుగుతుంది.
దేశంలో ఏడాదికి రూ.2 కోట్లు వరకు వ్యాపారం చేసేవారు పూర్తిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి సిద్దపడితే వారు సుమారు 30 శాతం వరకు ఆదాయపన్ను మినహాయింపు పొందవచ్చని చెప్పారు.
దేశంలో ఏ వ్యాపారి కూడా తన అమ్మకాలని, దాని ద్వారా తను సంపాదించుకొంటున్న లాభాలని ప్రభుత్వానికి తెలియజేసి దానికి పన్ను చెల్లించాలనుకోడనే సంగతి ఆర్ధికమంత్రిగా వ్యవహరిస్తున్న అరుణ్ జైట్లీకి తెలియదంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ వ్యాపారులలో అంత నిజాయితీ ఉండి ఉంటే దేశంలో ఇంత నల్లధనం పోగుపడేదే కాదు. అయితే ఇక నుంచి వారు చేసే వ్యాపారాలలో కొంత నగదు రహిత లావాదేవీలు చేసి అరుణ్ జైట్లీ ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా వారు తప్పకుండా వినియోగించుకొని పన్ను మినహాయింపుని కూడా పొందడం ఖాయం.
ఒకవేళ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించదలిస్తే దానికి నోటి మాటలు సరిపోవు. దాని కోసం ప్రోత్సాహకాలు, విధివిధానాలు, మార్గదర్శకాలతో కూడిన చట్టాలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు వంటివి చేయవలసి ఉంటుంది.
నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించాలనుకొన్న తెలంగాణా ప్రభుత్వం ముందుగా దానిపై చాలా లోతుగా అద్యయనం చేసి మొదట సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా దానిని అమలుచేసి దానిలో సాధ్యాసాధ్యాలు, కష్టనష్టాలను బేరీజు వేసుకొని అందుకు తగిన విధివిధానాలను రూపొందించుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే టీ వాలెట్ మొబైల్ యాప్ ని ప్రవేశపెట్టడానికి అది తొందరపడకుండా దానిని రూపొందించడానికి కూడా తెరాస సర్కార్ చాల గట్టి కసరత్తే చేస్తోంది. కానీ కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ నోటి మాటలతోనే దానిని అమలు చేసేయమని చెపుతుండటమే చాలా విచిత్రంగా ఉంది. నోట్ల రద్దు తదనంతర పరిణామాలని ఎదుర్కోవడానికి ఆయన చేస్తున్న కృషి ఏమిటో తెలియదు. కేవలం ఇటువంటి ప్రకటనలకే పరిమితం అయినట్లు కనిపిస్తుంది.