జానారెడ్డి టంగ్ స్లిప్.. కేటిఆర్ నైస్ క్యాచ్

December 20, 2016


img

తెలంగాణా కాంగ్రెస్ శాసనసభపక్ష నేత కె.జానారెడ్డి మిషన్ కాకతీయపై  ఈరోజులో శాసనసభలో జరుగుతున్న చర్చలో మాట్లాడుతున్నప్పుడు పొరపాటున నోరు జారి మంత్రి కేటిఆర్ కి అడ్డంగా దొరికిపోయారు. 

తెరాస సర్కార్ చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చెపుతున్నది వినడానికి కూడా ఇష్టపడటం లేదని, తెరాస పాలన చూస్తుంటే తెలంగాణా ఇచ్చి పొరపాటు చేశామేమోననే భావన కలుగుతోందని అన్నారు. తమ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్ళ పాటు అధికారంలో ఉందని, తలుచుకొంటే తెరాసని అప్పుడే అణచివేసి ఉండేవాళ్ళమని, కానీ తమ పార్టీ ప్రజాస్వామ్యా విధానాలను గౌరవిస్తుంది కనుక అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు ఎన్నడూ చేయలేదని అన్నారు. 

తెలంగాణా ఏర్పాటు అయినా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కనుకనే రాష్ట్రం వచ్చి ఏమి ప్రయోజనం? అనే ఉద్దేశ్యంతోనే జానారెడ్డి ఆవిధంగా అన్నట్లు అర్ధం అవుతూనే ఉంది. కానీ మంత్రి కేటిఆర్ వెంటనే స్పందిస్తూ, “దశాబ్దాలుగా కొట్లాడి తెలంగాణా సాధించుకొంటే, తెలంగాణా ఏర్పడటం పొరపాటేమో అన్నట్లుగా జానారెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చిందని చెప్పుకొంటూ, మళ్ళీ ఇవ్వడం పొరపాటేమో అని జానారెడ్డి అనడాన్ని కేటిఆర్ తప్పు పట్టారు. 

ఇక తెరాసను అణచివేయడంపై జానారెడ్డి అన్నమాటలని కూడా కేటిఆర్ తప్పు పట్టారు. వయసులో, అనుభవంలో అన్నిటిలో పెద్దవారైన జానారెడ్డి ఆవిధంగా మాట్లాడటం చాలా తప్పని కేటిఆర్ వాదించారు. ఇంత వయసొచ్చిన మీకే ఇంత ఆవేశం ఉంటే, ఇంక వయసులో ఉన్న మేమెంత ఆవేశాపడాలి?” అని కేటిఆర్ ప్రశ్నించారు. ఆయనంటే తమకి చాలా గౌరవం ఉందని కానీ ఆయన ఈవిధంగా నోరు జారడం సరికాదని కనుక తన మాటలను ఉపసంహరించుకోవాలని కేటిఆర్ కోరారు.

కానీ జానారెడ్డి కూడా కేటిఆర్ కి చాలా ధీటుగానే జవాబు చెప్పారు. తెలంగాణా వద్దని తాను అనలేదని, కొత్త రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువలేనప్పుడు ఇచ్చి ఏమి ప్రయోజనం కలిగిందని మాత్రమే అన్నానని అన్నారు. తెరాస సర్కార్ పాలన ఎంత అప్రజాస్వామికంగా సాగుతోందో చెప్పడానికే తను ఆ మాట అన్నానని అన్నారు. 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెరాసని అణచివేయాలని ప్రయత్నించలేదు కానీ దానిని తమ పార్టీలో విలీనం చేసేసుకొని పూర్తిగా కనబడకుండా చేసేయాలని ప్రయత్నించింది. ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కూడా తప్పనిసరి పరిస్థితులలో కూడికలు తీసివేతలు, లాభనష్టాల లెక్కలన్నీ కట్టుకొన్న తరువాతనే ఇచ్చింది తప్ప నిజంగా తెలంగాణా ప్రజల ఆకాంక్షని గౌరవించి కాదనే సంగతి ప్రజలకి కూడా తెలుసు. అందుకే దానిని ఎన్నికలలో తిరస్కరించారు. 


Related Post