దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతిపై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె హత్యకు ఆసుపత్రిలోనే కుట్ర జరిగి ఉండవచ్చని, ఆమెకు స్లో-పాయిజనింగ జరిపి ఉండవచ్చని అన్నాడిఎంకె పార్టీ బహిష్కృత ఎంపి శశికళ పుష్ప, జయలలిత బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెని అపోలో ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి మృతి చెందేవరకు ఆమె బందువులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్, ఆమె వీరవిధేయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా ఎవరినీ జయలలితను చూసేందుకు అనుమతించలేదు. ఆమె పూర్తిగా కోలుకొన్నారని ఇక ఆమె ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పిన తరువాతైనా ఆమెని చూసేందుకు వారిలో ఎవరినీ అనుమతించకపోవడం వలన ఆ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ఆమె చనిపోయిన తరువాత మాత్రమే అందరూ ఆమె భౌతికకాయాన్ని చూడగలిగారు.
అంతటి ప్రముఖ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తునప్పుడు, కనీసం ఆమె ఫోటోలు, వీడియోని కూడా బయటపడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అందుకే జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆమె మరణం ఒక మిష్టరీగా మిగిలిపోయింది. అందుకే అపోలో ఆసుపత్రిలో ఆమెకి అందించిన వైద్యంపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు.
ఆవిధంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారికి సంతృప్తికరమైన సమాధానం చెప్పవలసిన అధికార అన్నాడిఎంకె పార్టీ వారిపై తీవ్రంగా విరుచుకుపడుతుండటంతో అది వారి అనుమానాలు ఇంకా పెరగడానికే దోహదపడుతోంది. ఈ నేపద్యంలో అపోలో ఆసుపత్రి చైర్మన్ డా.ప్రతాప్ సి.రెడ్డి ఆమెకి అందించిన చికిత్సపై వివరణ ఇవ్వడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.
జయలలితకి అపోలో ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యం అందించామని, ఆమె తమ ఆసుపత్రిలో ఉన్నంత కాలం తాను కూడా చెన్నైలోనే ఉంటూ రోజూ ఆమెకు జరుగుతున్న చికిత్సని పర్యవేక్షించేవాడినని చెప్పారు. ఆమెకి పూర్తి స్వస్థత చేకూరడంతో తనకి అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చిందని, తిరిగి రాగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తనే ఆమెకి చెప్పి హైదరాబాద్ వెళ్ళానని కానీ అంతలోనే ఆమెకి అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి చనిపోవడం చాలా బాధ కలిగించిందని ప్రతాప్. సి. రెడ్డి అన్నారు. వైద్యపరంగా ఆమెకి ఎటువంటి లోపం జరుగలేదని అన్నారు. జయలలిత ఎంత అనారోగ్యంతో ఉన్నా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కనబరుస్తూ చిరునవ్వుతో పలుకరించేవారని ఆయన చెప్పారు.
అయితే జయలలిత ఆసుపత్రిలో ఉన్నన్ని ఎరోజులు ఎవరినీ ఎందుకు కలుసుకోనీయలేదు? కనీసం ఆమె ఫోటోలు, వీడియోలనైనా ఎందుకు విడుదల చేయలేదు? ఆసుపత్రిలో జరిగిన చికిత్సపై సిబిఐ చేత దర్యాప్తు జరుపాలని వస్తున్న డిమాండ్ల గురించి ఆయన ఏమీ చెప్పలేదు. బహుశః జయలలిత మరణం ఎప్పటికీ మిష్టరీగానే మిగిలిపోతుందేమో!