నోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చ జరపాలని, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకి హాజరయ్యి దీనిపై సమాధానం చెప్పాలని, దీనిపై ఓటింగ్ జరపాలని పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఉభయ సభలని స్తంభింపజేస్తున్నాయి. అవేమీ అసాధ్యమైన కోరికలు కోరడం లేదు. దేశాన్ని కుదిపివేస్తున్న అతిముఖ్యమైన సమస్యపై మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సభకి రావాలని కోరడం తప్పు కాదు. సభకి వచ్చి చర్చలో పాల్గొనాలని కోరడం తప్పు కాదు. దానిపై ఓటింగ్ జరపాలని కోరడం కూడా తప్పు కాదు.
ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొంటున్నప్పుడు, అదే ఆత్మవిశ్వాసంతో సభకు హాజరయ్యి పార్లమెంటు సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు చెప్పి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ ఆయన కూడా రాహుల్ గాంధీలాగే, చంటి పిల్లాడు అమ్మకి పిర్యాదు చేసినట్లుగా, తనని పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లడనీయడం లేదని ప్రజలకి పిర్యాదు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఒకప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ‘శలవు పెట్టి’ విదేశాలకి పారిపోయినప్పుడు అందరూ ఆయనని గేలి చేశారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్పవక్త అని పేరు పొందిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు పార్లమెంటుకి వెళ్ళకుండా తను తీసుకొన్న నిర్ణయంపై సభలో చర్చించకుండా తప్పించుకొని తిరుగుతుంన్నందున ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయనని గేలి చేయగలుగుతున్నారు. ఆయన ఏదో ఆలోచనతోనే ఆవిధంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన తీరు దేశప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తోందని చెప్పక తప్పదు.
ఆయన సభకి రాకపోవడంపై ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకి జవాబుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్య నాయుడు చెప్పిన సమాధానం కూడా ఇంకా హాస్యాస్పదంగా ఉంది.
ప్రధాని పర్యటనలలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయంలో పార్లమెంటులోనే ఉంటున్నారని, ఆయనే అందరి కంటే ముందుగా పార్లమెంటుకి వస్తారని, అందరి కంటే ఆఖరుగా వెళతారని వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు తిట్లని వినడానికి ఆయన పార్లమెంటుకి రావలసిన అవసరం లేదని చెప్పారు. ఆయన సభకి రాకపోయినా తన గదిలో కూర్చొనే సమావేశాలని చూస్తుంటారని అవసరమైతే తప్పకుండా సభకి హాజరవుతారని చెప్పారు. ఈనెల 16తో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియబోతున్నందున రేపటి నుంచి ప్రతీ రోజూ ప్రధాని మోడీ పార్లమెంటుకి హాజరవుతారని వెంకయ్య నాయుడు చెప్పారు.
దేశాన్ని కుదిపివేస్తున్న నోట్ల రద్దు సమస్యపై పార్లమెంటులో చర్చించవలసిన సమయంలో ప్రధాని మోడీ దానికి హాజరయ్యి సభ్యుల అభిప్రాయలు, సూచనలు, సలహాలు తీసుకొనే ప్రయత్నం చేయకుండా, పర్యటనలకి వెళ్ళడం దేనికి? తనని పార్లమెంటులో మాట్లడనీయడం లేదని అక్కడ ప్రజలకి మోర పెట్టుకోవడం దేనికి? ఇంత ముఖ్యమైన సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలని, దానిలో ఆయన పాల్గొని సమాధానాలు చెప్పాలని ప్రతిపక్షాలు కోరుతున్నప్పుడు ఆయన తన గదిలో కూర్చోని చూస్తున్నారని వెంకయ్య నాయుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియదు కానీ ఆయన తీరు ఆయన స్థాయికి తగ్గట్లుగా లేదని చెప్పక తప్పదు. ఆయన తన నిర్ణయం సరైనదేనని, దాని వలన దేశానికి తప్పకుండా మేలు కలుగుతుందని భావిస్తున్నప్పుడు, అదే విషయం పార్లమెంటు సభ్యులకి కూడా గట్టిగా చెప్పి వారిని ఒప్పించి ఉండి ఉంటే ఆయన గౌరవం, పేరు ప్రతిష్టలు ఇంకా పెరిగి ఉండేవి కదా!