వారిని ఆర్.బి.ఐ. కూడా ఏమీ చేయలేదా?

December 13, 2016


img

దేశంలో నల్లకుభేరులు బ్యాంకుల నుంచి వందల కోట్లు విలువగల రూ.2,000 నోట్లని యధేచ్చగా తరలించుకొనిపోతున్నారు. వారిలో కొందరు మాత్రమే పట్టుబడుతున్నారు. కేవలం ఒక్క రూ.2,000 కోసం బ్యాంకులు, ఎటిఎంల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్న వారు  మీడియాలో ఆ వార్తలని చూసి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు గానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేలుకోలేదు.

నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన చేసిన రోజు నుంచి డిశంబర్ 30 వరకు దేశంలో అన్ని బ్యాంకుల ఏర్పాటు చేసి ఉన్న సిసి కెమెరాల ఫుటేజిని, అలాగే లావాదేవీల రికార్డులని భద్రం చేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని బ్యాంకులలో ఉద్యోగులు, అధికారులే నల్లధనాన్ని మార్పిడికి సహకరించినట్లు వార్తలు వస్తున్నాయని అటువంటివారిపై కటిన చర్యలు తీసుకొంటామని ఆర్.బి.ఐ. హెచ్చరించింది.

వాస్తవానికి అక్టోబర్ 27నే దేశంలో అన్ని బ్యాంకులలో నగదు లావాదేవీలు జరిగే ప్రాంతాలలో సిసి కేమేరాలని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పైగా ఆర్.బి.ఐ. నుంచి బ్యాంకులకి పంపించే ప్రతీ పైసాకి లెక్కలు ఉంటాయి. అలాగే బ్యాంకుల నుంచి ఆర్.బి.ఐ.కే వచ్చే డబ్బుకి పక్కాగా లెక్కలు ఉంటాయి. కనుక బ్యాంకులలో జరుగుతున్న అక్రమాలని పట్టుకోదలిస్తే సిసి కెమెరాల ఫుటేజి అవసరం లేదు. లెక్కలు తీస్తే అన్ని అక్రమాలు బయటకి వస్తాయి. ఈ సంగతి నల్లధనం మార్చడానికి సహకరిస్తున్న బ్యాంక్ ఉద్యోగులు లేదా అధికారులకి కూడా బాగా తెలుసు. అయినా వారు వందల కోట్లు విలువగల కొత్త నోట్లని బాక్సుల సీలు కూడా తెరవకుండానే గుట్టుగా బయటకి పంపించేస్తున్నారు. అంటే వారు ఆ రిస్క్ కి సిద్దపడే ఆ పని చేస్తున్నట్లు భావించవచ్చు. మరి అటువంటి వారిపై ఆర్.బి.ఐ. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది? చర్యలు తీసుకోలేనప్పుడు సిసి కెమెరాలలో రికార్డులు దాచుకొని ఏమి చేస్తుంది?


Related Post