ఉగ్రవాది కుటుంబానికి నష్ట పరిహారం!

December 13, 2016


img

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి, వాటి నేతలకి భారత్ కంటే పాక్ పాలకులతో, వారి ఉగ్రవాదులతో, కాశ్మీర్ వేర్పాటువాదులతో సన్నిహిత సంబంధాలున్నాయనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. దానినే మరొక్కమారు నిరూపిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఈరోజు భద్రతాదళాల చేతిలో హతం అయిన హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీ కుటుంబానికి రూ.4 లక్షలు నష్ట పరిహారం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఒక ఉగ్రవాది మరణిస్తే ప్రభుత్వం అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడం దేశంలో ఇదే మొదటిసారని చెప్పవచ్చు. అతను మరణించిన తరువాత ఆమె స్థానిక ప్రజలతో మాట్లాడుతూ “అతను బుర్హాన్ వనీ అని భద్రతాదళాలకి తెలియదు. తెలిసి ఉంటే అతనిని చంపేవారు కాదు. అతనిని చంపినందుకు వారు (భద్రతాదళాలు) ప్రజలకి క్షమాపణలు చెప్పుకోవాలి, అని కోరుతున్నాను అని మహబూబా ముఫ్తీ అన్నారు. అంటే అతనిని ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వం, భద్రతాదళాలు చాలా తప్పు చేశాయని ఆమె భావిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది. 

బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ కి నిరసనగా కాశ్మీర్లో మూడు నెలలకు పైగా జరిగిన అల్లర్లలో సుమారు 110 మందికి పైగా ఆందోళనకారులు చనిపోయారు. సుమారు 2,000 మందికి పైగా గాయపడ్డారు. ఆ అల్లర్లని ఎదుర్కోలేక మహబూబా ముఫ్తీ పరుగున డిల్లీ వచ్చి కేంద్రప్రభుత్వం సహాయం అర్ధించారు. అప్పుడు కేంద్రప్రభుత్వం అతికష్టం మీద అల్లర్లని అదుపు చేయగలిగింది. 

రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోగానే, ముఖ్యమంత్రి ముఫ్తీ మళ్ళీ వేర్పాటువాదులకి, తీవ్రవాదులకి వంత పాడటం మొదలుపెట్టినట్లున్నారు. వారిని మంచి చేసుకొంటే తప్ప తన అధికారం, ప్రభుత్వం మనుగడ సాగించలేదని గ్రహించినందునే, బుర్హాన్ వనీ కుటుంబానికి నష్ట పరిహారం ప్రకటించారని భావించవచ్చు. వేర్పాటువాదులకి, ఉగ్రవాదులకి వంతపాడుతున్న అటువంటి ముఖ్యమంత్రితో కలిసి భాజపా నిర్లజ్జగా అధికారం పంచుకొంటోంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చేసిన ఈ పనికి కేంద్రప్రభుత్వం ఏమని సమాధానం చెపుతుంది? ఆమె చర్యని ధైర్యంగా వ్యతిరేకించగలదా లేదా సమర్ధించగలదా? 


Related Post