తెల్లటి దుస్తులు, తలపై నీలి రంగు తలపాగాతో కనిపించే మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తన పదేళ్ళ పాలనలో ఏనాడు అవినీతికి పాల్పడినట్లు ఒక్క ఆరోపణ కూడా ఎదుర్కోలేదు కానీ ఆ పదేళ్ళలో జరిగిన డజన్ల కొద్దీ కుంభకోణాలకి ఆయన ప్రత్యక్ష సాక్షి..ఆయన అభిప్రాయం, అంగీకారం లేకుండానే అవన్నీ జరిగిపోయాయి. ఆ కుంభకోణాల గురించి ఆయనకు పూర్తిగా తెలిసి ఉన్నప్పటికీ, సోనియా గాంధీ చెప్పిన చోటల్లా ఆయన సంతకాలు పెట్టారు కనుక ఆయన స్వయంగా అవినీతికి పాల్పడకపోయినా, ఆయన ప్రభుత్వ హయంలో జరిగిన ప్రతీ కుంభకోణానికి బాధ్యత వహించక తప్పడం లేదు.
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన బారీ కుంభకోణంలో అయనని ముద్దాయిగా పేర్కొంటూ, విచారణ కోసం కోర్టుకి హాజరుకమ్మని డిల్లీలో ప్రత్యేకకోర్టు నోటీసులు జారీ చేసినప్పుడు, సుప్రీంకోర్టు దయతలిచి ఆయనని ఆ కేసు నుంచి బయటపడేసింది. సుప్రీం దయతో తన తెల్లటి బట్టలకి అంటిన ఆ బొగ్గు మసిన ఆయన ఎలాగో వదిలించుకోగలిగారు కానీ మళ్ళీ మరో కుంభకోణం కేసు ఇప్పుడు ఆయన పీకకి చుట్టుకొనేలా ఉంది.
అదే..అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసు. రూ.3,600 కోట్ల విలువగల ఆ హెలికాఫ్టర్ల కొనుగోలు వ్యవహారంలో అందరూ కలిసి రూ.462 లంచాలు మేసేసినట్లు బయటపడటంతో, దానిపై సిబిఐ దర్యాప్తు జరిపి ఇటీవలే మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్.పి. త్యాగిని అరెస్ట్ చేసి జైలుకి పంపింది.
ఆ కేసులో డా.మన్మోహన్ సింగ్, ఆనాడు ఆయన ముఖ్యకార్యదర్శి టికెఎ నాయర్, ఆయన కార్యాలయంలో పని చేసిన ఉన్నటాదికారులని, నాటి సిబిఐ చీఫ్ రంజిత్ సిన్హా, నాటి జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్ మొదలైన వారినందరినీ సిబిఐ ప్రశ్నించబోతోందని తాజా సమాచారం. ఆ కేసులో సిబిఐ కనుక ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే డా.మన్మోహన్ సింగ్ మళ్ళీ కోర్టుకి హాజరుకాక తప్పదు.
విచిత్రం ఏమిటంటే, తెలంగాణా ఇచ్చింది ఎవరంటే సోనియా గాంధీ అని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటుంటారు. అంటే మంచి జరిగితే ఆ క్రెడిట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి, చెడు(కుంభకోణాలు)కి డా.మన్మోహన్ సింగ్ బాధ్యత వహించవలసివస్తోందన్న మాట! అందుకు ఆయన తనని తానే నిందించుకోవలసి ఉంటుంది.
ఆనాడు ఆయన ఈ కుంభకోణాలని వ్యతిరేకించి ఉండి ఉంటే, దేశానికి ఇన్ని లక్షల కోట్లు నష్టమూ కలిగి ఉండేది కాదు అలాగే శేషజీవితం ప్రశాంతంగా గడుపవలసిన ఈ సమయంలో అయన ఇలాగ కోర్టుల చుట్టూ తిరుగవలసిన అవసరమూ ఉండేది కాదు కదా?