అవును అందుకే రూ.2000 నోటు తెచ్చాం!

December 12, 2016


img

దేశంలో నల్లధనం వెలికి తీయడానికే పెద్ద నోట్లని రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ గట్టిగా చెపుతున్నారు కానీ వారిలో మోడీతో సహా ఎవరూ కూడా నల్లధనం ఇంకా పెరిగేందుకు దోహదపడే రూ.2,000 నోటుని ఎందుకు ప్రవేశపెట్టారనే ప్రశ్నకి జవాబు చెప్పడం లేదు. వచ్చే ఏడాది 5 రాష్ట్రాలలో జరుగబోయే శాసనసభ ఎన్నికలకి ముందు లేదా 2019  సార్వత్రిక ఎన్నికలకి ముందు రద్దు చేయడానికే దానిని ప్రవేశపెట్టి ఉండవచ్చని మైతెలంగాణా.కామ్ అప్పుడే ఊహించి చెప్పింది. ఊహించినట్లుగానే ఆ పెద్ద నోటుని రద్దు చేయడానికే ప్రవేశపెట్టామని ఆర్.ఎస్.ఎస్. సిద్దాంతకర్తలలో ఒకరైన ఎస్.గురుమూర్తి చెప్పారు. అయితే దానికి ఎటువంటి నిర్దిష్టమైన సమయం చెప్పకుండా వచ్చే ఐదేళ్ళలో ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు దేశంలో అతిపెద్ద నోటుగా రూ.500 మాత్రమే ఉంటుందని చెప్పారు.

నోట్ల రద్దు వలన దేశంలో సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నప్పటికీ, దేశంలో చాలా బారీగా నల్లధనం పోగేసుకొన్నవారికి ఇది ఇంకా పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు. అయితే వారిది తేలు కుట్టిన దొంగ పరిస్థితి కనుక ఆ నొప్పిని, బాధని, తమ కష్టాలని బయటకి చెప్పుకోలేక నిశబ్దంగా విలపిస్తున్నారని భావించవచ్చు. కానీ శేఖర్ రెడ్డి వంటి పలుకుబడి గలవారు తమ నల్లదనాన్ని అప్పుడే రూ.2,000 నోట్లలోకి మార్చేసుకోగలుగుతున్నారు. బహుశః అన్ని రాజకీయ పార్టీలలో నేతలు కూడా ఆ పని ఈపాటికే పూర్తిచేసుకొనే ఉంటారు లేదా ఈ డిశంబర్ 30వ తేదీలోగా తమ వద్ద ఉన్న నల్లధనం మొత్తం రూ.2,000 నోట్ల రూపంలోకి మార్చేసుకోవడం ఖాయం. 

నల్లకుభేరులు తమ వద్ద ఉన్న కోట్లాది రూపాయల నల్లదనాన్ని రూ.100 నోట్లలోకి మార్చుకోవడమూ కష్టమే. ఒకవేళ మార్చుకోగలిగినా దానిని దాచుకోవడం ఇంకా కష్టమే. కనుక చాలా రిస్క్ అని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితులలో అందరూ తమ వద్ద ఉన్న నల్లదనాన్ని రూ.2,000 నోట్ల రూపంలోకి మార్చుకోవలసి వస్తోంది. బహుశః అందుకే కేంద్రప్రభుత్వం దేశంలో రూ.500, 1,000 నోట్లని విడుదల చేయడం లేదేమో? 

మళ్ళీ పోగవుతున్న ఈ నల్లధనమంతా మరొకసారి ఆ పెద్ద నోట్లని కూడా రద్దు చేయడం ద్వారా క్లీన్ చేసేయవచ్చు. అప్పటికి కానీ ‘మిషన్ నోట్ల రద్దు’ పూర్తి కాదు. దాని వలన దేశ ఆర్ధిక బలపడుతుంది. ఆ పనేదో ఎన్డీయేకి చాలా కీలకమైన సార్వత్రిక ఎన్నికలకి ముందు చేసినట్లయితే దానితో భాజపా తన రాజకీయ ప్రత్యర్దులని మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయగలదు. బహుశః అందుకే కేంద్రప్రభుత్వం రూ.2000 నోట్లని ప్రవేశపెట్టి ఉండవచ్చు. అయితే భాజపా ప్రత్యర్ధులు కూడా మోడీ వ్యూహాన్ని పసిగట్టే ఉండవచ్చు కానీ వారి వద్ద వేరే ‘ఆప్షన్స్’ లేకుండా చేసేశారు ప్రధాని నరేంద్ర మోడీ!   


Related Post