జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కథువాలో జరిగిన ఒక సభలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ “భారత్, పాక్ లు మాట ప్రాతిపదికన 1947లో విడిపోయాయి. అప్పటి నుంచి భారత్ లో ఉన్నా 77 తెగలకి చెందిన ముస్లిం ప్రజలు అందరూ దేశంలో ఇతర మతస్తులు అందరితో కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ ముస్లిం దేశంగా అవతరించిన పాకిస్తాన్ లో మాత్రం అశాంతి నెలకొంది. ఉగ్రవాదానికి నిలయంగా మారింది. ఐసిస్ ఉగ్రవాదంతో అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి కానీ భారత్ మాత్రం ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంది. భారత్ ని మతప్రాతిపదికన విభజించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ ఉగ్రవాదుల కారణంగా ఆ దేశమే ఏదో ఒకరోజు 10 ముక్కలు అయిపోయే అవకాశం ఉందని గ్రహించలేకపోతోంది. పాకిస్తాన్ పాలకులకి తమ దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే కోరిక ఉన్నట్లయితే, వారికి సహకరించేందుకు భారత్ సిద్దంగా ఉంది,” అని అన్నారు.
కాశ్మీర్ కోసమైతేనేమి, లేదా పాక్ పాలకులు తమ అసమర్ధతని, వైఫల్యాలని కప్పుపుచ్చుకోవడానికైతేనేమి..రెండు మూడు దశాబ్దాలుగా భారత్ పైకి ఉగ్రవాదులని ఉసిగొల్పుతూనే ఉన్నారు. కానీ వాటితో భారత్ కి కొంత నష్టం కలిగించగలుగుతున్నారు కానీ వారు ఆశించిన ఫలితం మాత్రం పొందలేకపోతున్నారు. అందుకు కారణం భారత్ లో ముస్లింల నుంచి దానికి పూర్తి మద్దతు దక్కకపోవడం వలననే అని చెప్పక తప్పదు. ఏదో కొద్దిమంది అతివాదులు తప్ప మెజార్టీ ముస్లిం ప్రజలు అందరూ భారత్ తోనే తమ జీవితాలని పెనవేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారు. దేశంలో వివిధ మతాలకి చెందిన కోట్లాది మంది నిరుపేదలు కష్టాలు పడుతున్నట్లే, ముస్లింలలో కూడా కోట్లాదిమంది నిరుపేదలు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ అంతమాత్రాన్న వారు భారత్ ని ద్వేషించడంలేదు. రాజకీయ పార్టీలని, వాటి నేతలే తమ దుస్థితికి కారణమని భావిస్తున్నారు. అది నిజం కూడా!
నేటికీ దేశంలో అన్ని పార్టీలు ముస్లింలతో సహా ప్రజలందరినీ కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విభజించి, వారిని ఓటర్లు..ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప ప్రజలుగా చూడలేకపోతున్నాయి. అందుకు భాజపా కూడా అతీతమేమీ కాదని అందరికీ తెలుసు.
దేశ ప్రజలని మత ప్రాతిపదికన విభజించాలని పాకిస్తాన్ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, తమ భాజపా కూడా అదే ప్రాతిపదికన రాజకీయాలు చేస్తోందని విస్మరించినట్లున్నారు. భాజపా హిందూ ఓటు బ్యాంక్ ని నమ్ముకొని రాజకీయాలు చేస్తుంటుందనేది అందరికీ తెలుసు. అందుకే దానిపై మతతత్వ పార్టీ అనే ముద్ర ఉంది. దానిని అది ఏనాడూ చెరుపుకోవాలని గట్టిగా ప్రయత్నించలేదు. పైగా దానిని ఇంకా బలపరుచుకొనే ప్రయత్నాలే చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఉదాహరణకి యూపి ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాబ్రీ మశీదు-రామాలయానికి సమీపంలోనే శ్రీరామాయణ మ్యూజియం ఏర్పాటు చేయాలనుకోవడాన్ని చెప్పుకోవచ్చు.
అంతే కాదు అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న పిడిపితో కలిసి అధికారం పంచుకొంటోంది కూడా. ఒకవైపు భాజపా స్వయంగా మతతత్వ వైఖరి ప్రదర్శిస్తూ, వేర్పాటువాదులతో కలిసి పనిచేస్తున్నప్పుడు, పాకిస్తాన్ని నిందించడం దేనికి? ముందుగా తనపై ఉన్నా ఆ మతతత్వ ముద్రని, వేర్పాటువాదులతో ఉన్న ఆ అనుబంధాన్ని వదిలించుకొని దేశ ప్రజలందరికీ ప్రాతినిద్యం వహించగల సెక్యులర్ పార్టీగా మారే ప్రయత్నాలు చేస్తే అందరూ హర్షిస్తారు.